మళ్లీ వస్తోందిరా!
on Aug 20, 2017
‘హేయ్ పిల్లగాడా...’ అంటూ తెరమీద లొల్లి లొల్లి చేసేసి... యువతరం హృదయాలను గిల్లి పారేసింది సాయి పల్లవి. స్క్రీన్ మీద చూసి ఈ అమ్మాయిని ప్రేమించేసిన కుర్రాళ్లు ఉన్నారంటే నమ్ముతారా? ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో డిస్ట్రబ్ చేసిన హీరోయిన్ ఎవరూ లేరంటే అతిశయోక్తి కానేకాదు. దటీజ్ సాయిపల్లవి.
సాయిపల్లవి కోసమే ‘ఫిదా’ను మళ్లీ మళ్లీ చూసేస్తున్నారు కుర్రకారు. చూసిన సినిమానే మళ్లీ మళ్లీ ఏం చూస్తారూ.. అనుకున్నారో ఏమో... ఈ అందాలబొమ్మ మలయాళంలో నటించిన ‘కలి’ చిత్రాన్ని ‘హేయ్ పిల్లగాడా’ పేరుతో డబ్ చేసి తెరమీదకు వదులుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే... సాయిపల్లవి ఉంటే చాలు.. ఇంకేం అవసరం లేదంటున్నారు యూత్.
దుల్హన్ సల్మాన్ కథానాయకునిగా నటించిన ఈ చిత్రానికి సమీర్ తాహిర్ దర్శకుడు. మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన సినిమా ఇది. తప్పకుండా తెలుగులో కూడా విజయం సాధిస్తుందని నిర్మాత డి.వి.కృష్ణస్వామి చెబుతున్నారు.
ఏది ఏమైనా సాయిపల్లవి అల్లరిని మరో కోణంలో చూసే అవకాశాన్ని తెలుగు ప్రేక్షకులకు లభించిందన్న మాట. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.
Also Read