బాలయ్య లేకపోతే కామెడీ లేదా?
on Jun 26, 2016
ఇమిటేషన్ అన్నది నవ్వించడంలో ఓ ప్రక్రియ. మిమిక్రీ అనుకోండి.. ఓ నటుడి శైలిని మరో నటుడు సరదాగా అనుకరించడం అనుకోనివ్వండి.. ఏదైనా సరే - కామెడీ పుట్టించడం కోసమే. అయితే అది మరీ శృతిమించినా ప్రమాదమే. ఒకే నటుడ్ని పట్టుకొని పదే పదే కామెడీ చేస్తే ఇమిటేషన్కాస్త ఇరిటేషన్ గా మారుతుంది. ప్రస్తుతం పృధ్వీని చూసినా అదే అనిపిస్తోంది. పృధ్వీలో మాంచి కామెడీ టైమింగ్ ఉంది. తను నటుడిగా ఇప్పుడు సూపర్ ఫామ్లో ఉన్నాడు. బాగా నవ్విస్తున్నాడు. కాకపోతే ప్రతీ సినిమాలోనూ ఒకటే గోల. బాలయ్య గత చిత్రాల్ని చూడడం.. వాటిని స్నూఫ్లుగా మార్చుకోవడం, బాలయ్యలా నటించడం.. ఇదే తీరు. జేమ్స్ బాండ్, లౌక్యం, బెంగాల్ టైగర్ ఇలా దాదాపు ప్రతీ సినిమాలోనూ పృధ్వీది ఇదే పంథా.
తాజాగా... జక్కన్నలోనూ ఫృద్వీ ఇదే ఫార్ములా ఫాలో అయిపోయాడు. జక్కన్న టీజర్లో బాలయ్య డైలాగులన్నీ మళ్లీ వల్లించేశాడు ఫృద్వీ. మాటిమాటికీ అవే డైలాగులు, అవే సీన్లు రిపీట్ చేస్తే ఎలా? బాలయ్యను అనుకరించకపోతే పృధ్వీ కామెడీ సృష్టించలేడా? ఇలా ఎంత కాలం? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఒకట్రెండు సినిమాల వరకూ ఇది బాగానే ఉంటుంది. ఆ తరవాత మొహం మొత్తేస్తుంది. ఎంత బాగా చేసినా జనం లైట్ తీసుకొంటారు. ఆ నటుడి ప్రయాణమే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని ఫృద్వీ గుర్తించుకొంటే మంచిది. లేకపోతే మిగిలిన కమెడియన్లలా తను కూడా తొందరగా ఫేడవుట్ అయిపోయే ప్రమాదం ఉంది.