రెండో పెళ్లి వార్తలపై మంచు హీరో సెటైరికల్ ట్వీట్!
on Mar 7, 2021
హీరో మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ఇటీవల ఆన్లైన్లో ప్రచారంలోకి వచ్చింది. మనోజ్ రెండోసారి ప్రేమలో పడ్డాడనీ, ఆమె తనకు సరిజోడీ అని భావించిన ఆయన పెళ్లికి సిద్ధమయ్యాడనీ కొన్ని వెబ్సైట్లు రాసుకొచ్చాయి. ఇవి తన దృష్టికి రావడంతో మనోజ్ స్పందించారు.
తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఓ ఆన్లైన్ పోర్టల్ రాసిన న్యూస్‌ను షేర్ చేసిన ఆయన, "డేటూ టైమూ కూడా మీరే చెప్పేయండి" అని ట్వీట్ చేశారు. దానికి వెక్కిరిస్తున్న ఎమోజీతో పాటు ఆనందబాష్పాలు రాలుస్తున్న ముఖం ఎమోజీని జోడించారు. అంతే కాదు, దానికి ఇటీవల విడుదలైన 'జాతిరత్నాలు' సినిమా ట్రైలర్లో జడ్జిగా బ్రహ్మానందం కనిపించిన సీన్ తాలూకు రెండు మీమ్లను కూడా పెట్టారు.
మనోజ్ గతంలో ప్రణతి రెడ్డిని ప్రేమించి 2015లో పెళ్లి చేసుకున్నారు. కానీ స్వల్ప కాలంలోనే ఇద్దరి మధ్యా పొరపొచ్చాలు రావడంతో, పరస్పర అంగీకారంతో విడిపోయారు. 2019 అక్టోబర్‌లో వారికి విడాకులు మంజూరయ్యాయి.
అప్పట్నుంచీ సింగిల్‌గా ఉంటున్న మనోజ్, కెరీర్‌పై దృష్టి పెట్టారు. 'అహం బ్రహ్మాస్మి' అనే సినిమాని ప్లాన్ చేశారు. ఆ సినిమాలోని పాత్ర కోసం కొత్తగా మేకోవర్ అయ్యారు మనోజ్. అయితే ఆ సినిమా ప్లాన్ చేసి ఏడాది అయినా ఇంత దాకా సెట్స్ పైకి వెళ్లలేదు. దీనికి కారణాలు తెలియాల్సి ఉంది.