మమ్ముట్టిని డైరెక్ట్ చేయబోతున్న 'లవర్స్ డే' డైరెక్టర్
on Apr 9, 2020
ప్రియా ప్రకాశ్ వారియర్‌ను రాత్రికి రాత్రే స్టార్‌ను చేసిన 'ఒరు అడార్ లవ్' (తెలుగులో 'లవర్స్ డే') మూవీ డైరెక్టర్ ఒమర్ లులు, తన తదుపరి చిత్రంలో మలయాళం సూపర్‌స్టార్ మమ్ముట్టిని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని అభిమానులతో ఆన్లైన్ చాటింగ్ సందర్భంగా ధ్రువీకరించాడు ఒమర్. ఫిబ్రవరిలో పాపులర్ స్క్రిప్ట్ రైటర్ డెన్నిస్ జోసెఫ్‌తో ఒమర్ జట్టు కడుతున్నాడని వార్తలు వచ్చాయి. 2019లో హిట్టయిన మమ్ముట్టి, మోహన్‌లాల్ సినిమాలకు డెన్నిస్ స్క్రిప్ట్ రైటర్ కావడం గమనార్హం.
అప్పట్లోనే ఒక టాప్ స్టార్‌తో ఒమర్ కలిసి పనిచేయనున్నట్లు ప్రచారం జరిగినా, ఆ స్టార్ ఎవరనేది వెల్లడి కాలేదు. మమ్ముట్టితో తాను చేసే సినిమాలో ఫ్యాన్స్‌ను శాటిస్ఫై చేసే మాస్ ఎలిమెంట్స్ ఉంటాయని తెలిపాడు. డబుల్ మీనింగ్ డైలాగ్స్, కుళ్లు జోకులు ఈ సినిమాలో ఉండవని చెప్పాడు. 'ఒరు అడార్ లవ్'లో అసభ్యకర సన్నివేశాలు మోతాదు మించాయని, అందుకే అది ఫ్లాపయ్యిందనీ విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. యూత్‌ను టార్గెట్ చేసుకొని ఒమర్ తీసే సినిమాల్లో ఈ తరహా సీన్లు ఎక్కువగా ఉంటాయనే పేరు ఇదివరకే ఉంది. మరి మమ్ముట్టిని అతను ఎలా చూపిస్తాడనేది ఆసక్తికరం. మరోవైపు మమ్ముట్టి చివరి సినిమా 'షైలాక్' ప్రేక్షకుల్ని బాగా అలరించింది.