టాలీవుడ్ రిచ్చెస్ట్ యాక్టర్స్.. మహేశ్, ప్రభాస్!
on Aug 12, 2020
భారతీయ సినిమాలో మిగతా అన్ని భాషల యాక్టర్స్‌తో పోలిస్తే బాలీవుడ్ యాక్టర్స్ అత్యధికంగా సంపాదిస్తుంటారు. అలా అని సౌత్ యాక్టర్స్ మరీ వెనుకబడి ఏమీ లేరు. వారిలో కొంతమంది హిందీ టాప్ యాక్టర్ల కంటే ఎక్కువే సంపాదిస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ యాక్టర్ల సంపాదనను కలిపి చూస్తే.. దక్షిణాది సినిమా బాక్సాఫీస్ పరంగా ఏ స్థాయిలో ఎదిగిందో అర్థమవుతుంది.
2020 మార్చిలో మూతపడిన థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలీని అయోమయ స్థితిలో ఉన్నాం. వాటిని నమ్ముకుంటే లాభం లేదని కొన్ని సినిమాలు ఓటీటీలో రీలీజవుతుండటం చూస్తున్నాం. ఆ విషయం అలా ఉంచితే గత ఏడాది మన టాప్ 9 సౌత్ సూపర్ స్టార్స్ సంపాదన ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ లిస్టులో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ మాత్రమే స్థానం సంపాదించారు. ఆ ఇద్దరు.. మహేశ్ బాబు, ప్రభాస్. ఫోర్బ్స్ 2019 సెలబ్రిటీ 100 లిస్ట్ ద్వారా తెలిసిన వివరాలివి.
1. రజనీకాంత్
సౌతిండియాలో తలైవా అనే ప్రజాబిరుదుకు తగ్గట్లే సంపాదనలోనూ తలైవాగా నిలిచారు రజనీకాంత్. ఆయన 2019లో రూ. 100 కోట్లు ఆర్జించారు. ఎక్కువగా '2.0', 'పేట' సినిమాల ద్వారా ఆయనకు ఆదాయం సమకూరింది. ఫోర్బ్స్ సెలబ్రిటీ లిస్ట్‌లో ఆయనది 13వ స్థానం.
2. మోహన్ లాల్
ఫోర్బ్స్ సెలబ్రిటీ లిస్ట్‌లో 47వ స్థానం పొందిన మోహన్ లాల్ 2019లో సంపాదించింది రూ. 64.5 కోట్లు. ఆ ఏడాది ఆయనవి 5 సినిమాలు విడుదలయ్యాయి. 'లూసిఫర్' లాంటి హయ్యెస్ట్ గ్రాసర్ మూవీ చేసిన ఆయన పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు కూడా.
3. అజిత్‌కుమార్
2019లో 'విశ్వాసమ్', 'నేర్కొండ పార్వై' సినిమాలతో ఘన విజయాలు అందుకున్న అజిత్.. సౌత్‌లో అత్యధికంగా సంపాదించిన సెలబ్రిటీలలో మూడో స్థానం ఆక్రమించారు. ఈ ఏడాది ఆయన సంపాదన రూ. 40.5 కోట్లు.
4. మహేశ్ బాబు
2019 ఫోర్బ్స్ సెలబ్రిటీ లిస్ట్‌లో 53వ స్థానం పొందిన మహేశ్ బాబు 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' సినిమాల ద్వారా ఎక్కువగా ఆర్జించారు. మిగతాది ఎండార్స్మెంట్ల ద్వారా వచ్చినదే. రూ. 35 కోట్ల సంపాదనతో టాలీవుడ్లో ఆయనదే ప్రథమ స్థానం.
5. ప్రభాస్
'బాహుబలి', 'సాహో' సినిమాల ద్వారా ప్రస్తుతం ఏకైక పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ గత ఏడాది 'సాహో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 2019లో ఆయన ఆదాయం రూ. 34 కోట్లు. అంటే మహేశ్ కంటే కేవలం రూ. 1 కోటి మాత్రమే తక్కువ.
6. కమల్ హాసన్
ఈ లిస్ట్‌లో 2019లో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాని స్టార్ కమల్ హాసన్ మాత్రమే. ఫోర్బ్స్ లిస్ట్‌లో 56వ స్థానం పొందిన ఆయన రూ. 34 కోట్లు ఆర్జించారు. ఇందులో అధిక భాగం 'బిగ్ బాస్' షో ద్వారా వచ్చిందే.
7. మమ్ముట్టి
68 సంవత్సరాల వెటరన్ మలయాళం స్టార్ మమ్ముట్టి 2019లో ఏకంగా ఏడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వీటి ద్వారా ఆయనకు రూ. 33.5 కోట్ల ఆదాయం లభించింది.
8. ధనుష్
ఫోర్బ్స్ లిస్ట్‌లో 64వ స్థానంలో నిలిచిన ధనుష్ 'అసురన్', 'ఎనై నోకి పాయుమ్ తోట' (తెలుగులో 'తూటా') వంటి హిట్ సినిమాలు చేశాడు. వాటితో పాటు తన వండర్‌బార్ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించిన చిత్రాల ద్వారా రూ. 31.75 కోట్లను 2019లో సంపాదించాడు ధనుష్.
9. విజయ్
గత ఏడాది 'బిగిల్' (తెలుగులో 'విజిల్') వంటి బ్లాక్‌బస్టర్ మూవీలో నటించి అలరించాడు విజయ్. ఇండియాలోనే మోస్ట్ ట్వీటెట్ హ్యాష్ట్యాగ్గా ఆ సినిమా నిలిచింది. 2019లో విజయ్ సంపాదన రూ. 30 కోట్లు.
Also Read