కత్రినా-సేతుపతి సినిమాకు ఇంటర్వెల్ ఉండదు!
on Jan 22, 2021
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్, కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి ఆసక్తికర కలయికలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. 'అంధూధున్' ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నాడు. ప్రేక్షకుల్ని మునివేళ్లపై కుర్చీల్లో కూర్చోపెట్టే థ్రిల్లర్‌గా ఇది రూపొందనున్నది. ఏప్రిల్‌లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం పూణేలోని రియల్ లొకేషన్లలో జరగనున్నది.
ఇంకా టైటిల్ ఖరారు కానప్పటికీ, కత్రినా, విజయ్ సేతుపతి తొలిసారి కలిసి నటించనుండటంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ అంచనాలు అమితంగా పెరిగిపోయాయి. డైరెక్ట్ చేసిన ప్రతి సినిమాతో ఏదో ఓ కొత్తదనం అందిస్తూ వస్తోన్న శ్రీరామ్ రాఘవన్, ఈ సారి కూడా అదే తరహాలో ఓ కొత్త అనుభవాన్ని ఈ సినిమాతో ఇవ్వనున్నాడు. ఈ సినిమాకి ఇంటర్వెల్ అనేది ఉండదనేది లేటెస్ట్ అప్డేట్.
90 నిమిషాల నిడివితో ఇంటర్వెల్ లేకుండా ఏకబిగిన సినిమా నడుస్తుందని సమాచారం. ఇంటర్వెల్ ఉంటే ఫీల్ పోతుందనే ఉద్దేశంతోటే స్టార్ట్ టు ఫినిష్ ఉత్కంఠభరితంగా ఈ సినిమాని ఆయన రూపొందించనున్నాడు. 30 రోజుల్లో ఈ సినిమాని ఆయన ఫినిష్ చేయనున్నాడు. కొంత పోర్షన్‌ను ముంబైలోనూ చిత్రీకరిస్తారు.