విరామమెరుగని 78 ఏళ్ల 'యువకుడు'!
on Oct 28, 2020
కమర్షియల్‌గా తెలుగు సినిమాని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లిన అగ్రగణ్య దర్శకుల్లో కె. రాఘవేంద్రరావు ముందు వరుసలో ఉంటారనే సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ తొలినాళ్లలో 'జ్యోతి', 'ఆమె కథ', 'ప్రేమలేఖలు', 'కల్పన' వంటి నాయిక ప్రధాన చిత్రాలతో విజయాలు సాధించిన ఆయన అనంతర కాలంలో టాప్ కమర్షియల్ డైరెక్టర్‌గా ఎదిగారంటే నిరంతరం తనలోని ప్రతిభను మెరుగు పరచుకుంటూ రావడం వల్లే.
1977లో ఎన్టీ రామారావు హీరోగా ఆయన రూపొందించిన 'అడవిరాముడు' సాధించిన సంచలనాలతో ఆయన ఒక్కసారిగా టాప్ డైరెక్టర్ అయిపోయారు. అప్పట్లో ఆ సినిమా సాధించిన కలెక్షన్లు అందర్నీ అబ్బురపరిచాయి. మరీ ముఖ్యంగా అందులోని 'ఆరేసుకోబోయి పారేసుకున్నా' పాట అనంతర కాలంలో తెలుగు సినిమా పాట స్థితిగతుల్నే మార్చేసింది. 'పదహారేళ్ల వయసు', 'వేటగాడు', 'కొండవీటి సింహం', 'జస్టిస్ చౌదరి', 'దేవత', 'బొబ్బిలి బ్రహ్మన్న', 'అగ్నిపర్వతం', 'జగదేకవీరుడు అతిలోకసుందరి', 'మేజర్ చంద్రకాంత్', 'పెళ్లి సందడి', 'గంగోత్రి' వంటి సినిమాలు కమర్షియల్ డైరెక్టర్‌గా ఆయన ప్రతిభకు తార్కాణాలు. అటువంటి డైరెక్టర్ దృష్టి కొంతకాలం క్రితం భక్తిరసం వైపు మళ్లింది.
ఫలితంగా చారిత్రక కథలకు కమర్షియల్ హంగులద్ది ఆయన రూపొందించిన భక్తిరస చిత్రాలు 'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'శిరిడి సాయి' ఆయన కీర్తిని మరింత పెంచాయి. త్వరలో ఆయన 'పెళ్లి సందడి' సీక్వెల్‌ను తన పర్యవేక్షణలో తీసేందుకు రెడీ అవుతున్నారు. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించే ఈ సినిమా ద్వారా గౌరి రోణంకి దర్శకురాలిగా పరిచయమవుతోంది. ఆర్కా మీడియా వర్క్స్‌తో కలిసి రాఘవేంద్రరావు ఈ సినిమాని తన హోమ్ బ్యానర్ ఆర్.కె. ఫిల్మ్ అసోసియేట్స్‌పై నిర్మించనున్నారు.
ఇక అన్నింటికంటే ఆశ్చర్యం కలిగించేది ఆయన కథానాయకుడిగా తెరపై కనిపించనున్నారనే వార్త. రాఘవేంద్రరావు వయసు 78 సంవత్సరాలు. ఈ వయసులో హీరో అంటే పెద్ద విశేషమే. పైగా ఆ సినిమాలో ఒకరికి ముగ్గురు హీరోయిన్లు ఉంటారనీ, వారు రమ్యకృష్ణ, శ్రియ, త్రిష అనీ ప్రచారంలోకి రావడం మరింత విశేషం. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. కానీ మీడియాలో ఈ వార్తకు అమిత ప్రచారం లభిస్తోంది. ఇదే నిజమైతే దీనంత ఆసక్తికరమైన వార్త ఇంకొకటి ఉండదు.
తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు సొంతం చేసుకున్న రాఘవేంద్రరావు భవిష్యత్తులో ఇంకేం అద్భుతాలు చేయనున్నారో...