గుత్తా జ్వాల ఇంట్లో పెళ్లి సందడి షురూ!
on Apr 19, 2021
హైదరాబాద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్ పెళ్లి ఈ నెల 22న జరగనుంది. దీంతో జ్వాల ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఆమె స్నేహితులు పెళ్లికూతురు వేడుక నిర్వహించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది జ్వాల. వాటిలో ఒక ఫొటోలో 'bride-to-be' అనే బ్యానర్ బ్యాగ్రౌండ్లో కూర్చొని ఫొటోకు పోజిచ్చిందామె.
మిగతా ఫొటోల్లో ఫ్రెండ్స్‌తో సందడి చేస్తూ కనిపిస్తోంది. ఆ ఫొటోలకు, "What would I do without my girls.... Thank you @amritavir for hosting this amazing day. And wanna thank all my girls making it super special for me." అనే క్యాప్షన్ పెట్టింది.
కొంత కాలంగా డేటింగ్లో ఉన్న జ్వాల, విష్ణు విశాల్ రెండేళ్ల క్రితం తమ అనుబంధం గురించి సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేశారు. ఇప్పుడు తాము ఈ నెల 22న మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. తన సోషల్ మీడియా హ్యాండిల్లో వెడ్డింగ్ కార్డ్ పిక్చర్‌ను పోస్ట్ చేసిన విష్ణు విశాల్, దానికి #JwalaVished అనే హ్యాష్‌ట్యాగ్ జోడించాడు. "జీవితం ఒక ప్రయాణం ... దాన్ని ఆలింగనం చేసుకోవాలి ... విశ్వాసం కలిగి అందులో దూకాలి ... ఎప్పట్లాగే మీ ప్రేమ, మద్దతు కావాలి." అని రాసుకొచ్చాడు.
ఈ వెడ్డింగ్ కార్డును జ్వాల కూడా షేర్ చేసింది. అందులో, "మా కుటుంబాల ఆశీర్వాదంతో, సన్నిహితుల-ప్రియమైన వారి సమక్షంలో ఓ ప్రైవేట్ వ్యవహారంగా మా మ్యారేజ్ జరగబోతున్నదనే న్యూస్ పంచుకోవడం మాకు చాలా ఆనందాన్నిస్తోంది. మేం పెళ్లి చేసుకుంటున్నాం. ఇన్నేళ్లుగా మాపై మీరు కురిపిస్తున్న ప్రేమాభిమానాలకు థాంక్స్. ప్రేమ, విధేయత, స్నేహం, కలయిక అనే జర్నీని ప్రారంభిస్తున్న మాకు మీ ఆశీర్వాదాలు కావాలి." అని ఉంది.
గుత్తా జ్వాల, విష్ణు విశాల్ ఇద్దరికీ ఇది సెకండ్ మ్యారేజ్. జ్వాల ఇదివరకు సహ ఆటగాడు చేతన్ ఆనంద్‌ను పెళ్లి చేసుకొని, 2011లో విడిపోగా, విష్ణు విశాల్ సైతం రజిని నటరాజ్‌తో వైవాహిక బంధాన్ని 2018లో తెంచేసుకున్నాడు. విష్ణుకు రజిని ద్వారా ఆర్యన్ అనే కుమారుడు ఉన్నాడు.