English | Telugu

ఓరినాయనో.... జుట్లు పీక్కుంటున్నారు!

on Aug 10, 2017

ఈ శుక్రవారం ఏంటండీ బాబూ... నిజంగా సంక్రాంతినే తలపిస్తోంది. వచ్చేది కుర్ర హీరోల సినిమాలే అయినా.. ఆ హైప్ ఏంటి? ఆ హడావిడీ ఏంటి? ఏదో... చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు పోటీ పడుతున్నట్లు!.. వన్ కల్యాణ్, మహేశ్ బాబు సినిమాలు బరిలోకి దిగుతున్నట్లు!.. ఏంటీ అంచనాలు? కొన్ని సినిమాలకు అలా అన్నీ కలిసొస్తుంటాయ్... ఏమంటారు? పరిస్థితి చూస్తుంటే.. ఫలితాలు ఎలాగున్నా... బయ్యర్లకు మాత్రం డబ్బులు వచ్చేసేటట్టున్నాయ్. ఇది నిజంగా శుభపరిణామమే కదా!

ఇదంతా సరే... అసలు ఈ మూడు సినిమాల్లో విజేతగా నిలిచేదెవరు? ప్రస్తుతం ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎనలైజ్ చేసి చూస్తే.. వేటికవే గొప్పగా కనిపిస్తున్నాయ్. దాంతో ఏది ముందు చూడాలో అర్థంకాక.. సినిమా ప్రియులు జుట్లు పీక్కుంటున్నారు. 

‘జయ జానకీ నాయక’... టైటిల్ తోనే సగం విజయం ఖరారైపోయింది.  టైటిల్ ఎనౌన్స్ చేసిన్పట్నుంచీ... అంతా పాజిటీవ్ వైబ్రేషన్లే. ఇక కుర్రాడు బెల్లంకొండ శ్రీనివాస్ గురించి చెప్పేదేముంది.... చిచ్చరపిడుగు. ట్రైలర్స్ లోనే ఇరగదీసేస్తున్నాడు. ఆ ఎమోషన్ చూస్తుంటేనే బోయపాటి సినిమా ఎలా తీశాడో అర్థమైపోతోంది. సక్సెస్ పర్సంటేజ్ 99 శాతం ఉన్న దర్శకుడు బోయపాటికి ఇది మరో హిట్ అని ప్రత్యేకించి చెప్పాలా? ఇక రకుల్ , కేథరిన్ ల గ్లామరూ,  దేవిశ్రీ ప్రసాద్ పాటలూ, బెల్లంకొండ శ్రీనివాస్ స్టెప్పులూ... కుర్రాళ్లకు ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? 

‘నేనే రాజు నేనే మంత్రి’ విషయానికొద్దాం.  దర్శకుడు తేజా సక్సెస్ లో లేడుకదా! అని ఎవరైనా అనుకుంటే.. నిజంగా పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే... ఇప్పటివరకూ దాదాపుగా ప్రేమకథలనే తీసిన తేజా... తొలిసారి కొత్త జానర్ లో వెళ్లాడు. రాజకీయ నేపథ్యానికి, ఫ్యామిలీ ఎమోషన్లను మిళితం చేసి ఈ సినిమా తీశాడు. సో... కచ్చితంగా అద్భుతం జరగొచ్చు. హీరో రానా గురించి తెలిసిందేగా?. ‘బాహుబలి’ విజయాలతో జాతీయ స్థాయి నటునిగా ఎదిగాడు. ‘ఘాజీ’తో సూపర్ హిట్ కొట్టాడు. ముఖ్యంగా అతని టైమ్ బావుంది. ఈ సినిమాకు మరో అదనపు ఆకర్షణ కాజల్ అగర్వాల్. పోస్టర్లపై కాటన్ చీరలో ‘ప్రౌఢ’గా... ప్రౌడ్ గా.. కనిపిస్తున్న ఆ అమ్మాయిని చూస్తుంటే... చాలామంది కళ్లు తిప్పుకోలేకపోతున్నారంటే నమ్మండి. పరిస్థితులు చూస్తుంటే యాక్సిడెంట్లు కూడా జరిగేలా ఉన్నాయి. ఇక నిర్మాత డి.సురేశ్ బాబు  జడ్జిమెంట్ గురించి ప్రత్యేకించి చెప్పాలా?  

‘లై’సినిమా ఏమన్నా తక్కువ తిన్నదా? ఆ సినిమా ప్రమోషన్ చూస్తేనే అర్థమైపోతోంది... భిన్నమైన సినిమా అని. ఇంటలెక్చ్యువల్ స్క్రీన్ ప్లేతో దర్శకుడు అను రాఘవపూడి వండర్ అనిపించేలా ఈ సినిమా తీశాడని యూనిట్ వర్గాల భోగట్ట. నితిన్ న్యూలుక్ అయితే... అదిరింది. తను కూడా ‘అ ఆ’ విజయంతో మంచి ఊపుమీదున్నాడు. ఇక యాక్షన్ కింగ్ అర్జున్ ఎలాగూ ఉన్నాడు సినిమాను మోయడానికి. ఇంకేం కావాలి. 

అయితే...ఒకేసారి ఈ సినిమాలు విడుదల చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు కూడా పలు చోట్ల వ్యక్తమవుతున్నాయ్. వాస్తవానికి ‘నేనే రాజు...’చిత్రాన్ని ఒక రోజు ముందు విడుదల చేయాలనుకున్నారు. మధ్యలో ఏమైందో ఏమో... మళ్లీ కథ మొదటికొచ్చింది. శుక్రవారమే ఖరారైంది. శుక్ర, శని, ఆదివారాల్లో వీకెండ్ హడావిడి ఎలాగూ ఉంటుంది. ఇక సోమవారం శ్రీకృష్ణాష్టమి, మంగళవారం స్వాతంత్ర్య దినోత్సవం. సెలవులతో కలిసిన లాంగ్ వీకెండ్ అవ్వడంతో అందరూ 11వ తేదీనే ఖరారు చేసుకున్నారు. 

ఒకేసారి విడుదలైన.. ఖైదీ నంబర్ 150, గౌతమీ పుత్ర శాతకర్ణి, శతమానం భవతి చిత్రాలు.. ఘన విజయాలు సాధించాయంటే... దానికి కారణం.. అది సంక్రాంతి సీజన్ అవ్వడమే. సినిమావాళ్లకు దాన్ని మించిన సీజన్ మరొకటి ఉండదు. రేపు ‘శుక్రవారం’ కూడా అదే జోష్ కనిపిస్తోంది. మరి ఈ శుక్రవారం ‘సంక్రాంతి’ని తలపిస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే.. ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here