యూత్‌కు కిక్కునిస్తోన్న 'జర్రా జర్రా' సాంగ్
on Aug 24, 2019
'జర్రా జర్రా అచ్చా.. జర్రా జర్రా కచ్చా..' - ఇప్పుడు ఆన్లైన్లోనే కాకుండా బయట కూడా బాగా వైరల్ అయిన పాట ఇది. మాస్ నంబర్స్‌కు పేరుపొందిన భాస్కరభట్ల రవికుమార్ రాసిన ఈ పాట 'వాల్మీకి' లోనిది. ఆ సినిమాలో వరుణ్‌తేజ్ చేసిన పాత్ర వ్యక్తిత్వాన్ని ఈ పాట పట్టిస్తుంది. వరుణ్‌తేజ్, అధర్వ, డింపుల్ హయతిపై ఈ పాటను చిత్రీకరించారు. పి. సునీల్‌కుమార్ రెడ్డి డైరెక్ట్ చేసిన 'గల్ఫ్' మూవీలో నాయికగా నటించిన డింపుల్ హయతి.. ఈ సాంగ్‌లో ఐటం గాళ్‌గా దర్శనమివ్వనున్నది. ఆశ్చర్యమైన విషయమేమంటే, ఈ పాటకు బాణీలు కూర్చింది మిక్కీ జె. మేయర్. మెలోడీ ట్యూన్స్ స్పెషలిస్టయిన మిక్కీ నుంచి ఇలాంటి ఫుల్ మాస్ బీట్ సాంగ్‌ను మనం అస్సలు ఊహించలేం. అలాంటిది ఈ పాటకు అతడు సమకూర్చిన బాణీలు యువతను ఉర్రూతలూగిస్తున్నాయి. అనురాగ్ కులకర్ణి, ఉమా నేహ గళాల్లో ఊపిరి పోసుకున్న ఈ పాట లిరికల్ వీడియోను సోనీ మ్యూజిక్ సౌత్ మూడు రోజుల క్రితం యూట్యూబ్‌లో రిలీజ్ చెయ్యగా, ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. అధికారిక వీడియోకు ఇప్పటికే 2.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
హరీశ్ శంకర్ డైరెక్షన్లో 14 రీల్స్ ప్లస్ బేనర్లో రాం ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీలో వరుణ్ నెగటివ్ షేడ్స్ ఉన్న ఒక పవర్ఫుల్ రోల్‌ను పోషిస్తున్నాడు. అతనికి జోడీగా పూజా హెగ్డే కనిపించనున్నది. అధర్వ, మృణాలిని రవి మరో జంటగా నటిస్తున్నారు. అయనంక బోస్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన 'వాల్మీకి' మూవీ సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.