మేం దారినపోయే దానయ్యలం కాదండీ...?
on Sep 26, 2017
జూనియర్ ఎన్టీ రామారావుగారు చాలా బాగా మాట్లాడారండోయ్! బేసిగ్గా మంచి వక్త లేండి. మాటల్తోనే మాయ చేసేస్తారు మన రామారావుగారు.
అబ్బబ్బబ్బా... ఏం పోలికండీ... ‘సినిమా అనేది ఆపరేషన్ బెడ్ మీదున్న పేషంట్’ వహ్వా ..వహ్వా.
‘దర్శక, నిర్మాతలు... తల్లిదండ్రులు’.. ఒహో.. ఒహో..
‘ప్రేక్షకదేవుళ్లు.. డాక్టర్లు’.. వన్స్ మోర్, వన్స్ మోర్...
‘దారేపోయే దానయ్యలు... విశ్లేషకులు’.. అద్దిరిపోయిందండీ బాబూ పోలిక.
ఇలాంటి విషయాల్లో మీకు మీరే సాటి. మీకు రారెవరూ పోటీ. అయితే... చిన్న డౌట్! మీరంటున్న ఆ దారినపోయే దానయ్యలు.. లోపల పేషంట్ పరిస్థితిని చూసి, మాట్లాడారా? చూడకుండా మాట్లాడారా? ఈ విషయంపై మాత్రం మీరు క్లారిటీ ఇవ్వలేదు. నాకు తెలిసి... ఆ దారిన పోయే దానయ్యలందరూ పేషెంట్ ని చూసే మాట్లాడారు. చోద్యం కాకపోతే... మాట్లాడినంత మాత్రాన పేషంట్ చనిపోతాడా? చనిపోడు కదా!
పేషంట్ డిసీజ్ డాక్టర్లకు కూడా అంతుచిక్కనిది అయినప్పుడు కచ్చితంగా పోతాడు. అంటే రోగం తీవ్రతను బట్టి బతకడమో.. చావడమో తేలిపోతుందన్నమాట. దారిన పోయే దానయ్యలు పేషెంట్ గురించి ఎంత మాట్లాడుకున్నా... బతికేవాళ్లు బతక్క మానరు.. పోయేవారు పోకా మానరు. ఏమంటారు? మరి ఈ చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారూ?
ఇదే దారిన పోయే దానయ్యలూ... మీ ‘స్టూడెంట్ నంబర్ వన్’ చూసి.. ‘కుర్రాడిలో కసి ఉంది’ అని రాశారు. ఇదే దారిన పోయే దానయ్యలు.. మీ‘ఆది’చూసి ‘కుర్రాడిలో ఫైర్ ఉంది’ అని రాశారు. ‘సింహాద్రి’ చూసి భవిష్యత్తు మీదే అని రాశారు. బాగున్న ప్రతి సినిమానూ నెత్తిన పెట్టుకున్నారు. అప్పుడు వీళ్లు మంచోళ్లు. ఇప్పుడు దారినపోయే దాయ్యలు.
అంటే... మీదైన ఏ సినిమా వచ్చినా... బావుందని రాయాలన్నమాట. మీరే సినిమా తీసినా... ‘వరేవ్వా’ అనాలన్నమాట. లేకపోతే... ‘మా పేషంట్ ని చంపేశారు’ అని గుడ్డ కాల్చి విశ్లేషకులపై... అదే మీరంటున్న దారిన పోయే దానయ్యలపై వేసేస్తారన్నమాట.
టోటల్ గా మేం చెప్పొచ్చేదేంటంటే... ఆసుపత్రి వాసనంటేనే మాకు పడదండీ. అలాంటప్పుడు రేపోమాపో పోయే పేషంట్ తో రెండున్నర గంటలు ఎలా స్పెండ్ చేయమంటారు? చెప్పండి? మరిచిపోయా.... మేం దారిన పోయే దానయ్యలం కాదండీ... జనాలం. జనహృదయ దర్ఫాణాలం.