'అర్జున్‌రెడ్డి' దర్శకుడిపై హీరోయిన్లు గుస్సా
on Jul 9, 2019
'అర్జున్‌రెడ్డి' దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాపై టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ తేడాలు లేకుండా హీరోయిన్లు అందరూ గరమ్ గరమ్ అవుతున్నారు. కారణం ఒక్కటే... 'అర్జున్‌రెడ్డి' హిందీ రీమేక్ 'కబీర్ సింగ్' విడుదల తరవాత ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రేమించిన అమ్మాయిని కొట్టే స్వేచ్ఛ లేకపోతే అందులో ఏం ప్రేమ ఉన్నట్టని సందీప్ వ్యాఖ్యానించడమే. ఆల్రెడీ అతడి వ్యాఖ్యలు అభ్యంతకరంగా ఉన్నాయని సమంత ట్వీట్ చేయడం, ఆమెపై 'అర్జున్‌రెడ్డి' సినిమా అభిమానులు సెటైర్లు వేయడం తెలిసిన సంగతే. సమంతతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడలేదు. ఆమె కంటే ఆమెకు కొంచెం ముందో వెనుకో 'సమ్మోహనం' సుందరి అదితిరావ్ హైదరి, మరొకొందరు హీరోయిన్లు, గాయని చిన్మయి గళం విప్పారు. సందీప్ రెడ్డి వంగా స్టేట్మెంట్పై విరుచుకుపడ్డారు. కొందరు ఇంకా పడుతున్నారు. వివాదాన్ని వేడి వేడిగా ఉంచుతున్నారు. తాజాగా సందీప్‌రెడ్డి వంగాపై గరమ్ గరమ్ అవుతున్న హీరోయిన్ల జాబితాలో 'జెర్సీ' హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కూడా చేరారు. ఆమెపైనా నెట్టింట్లో కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారందరికీ శ్రద్ధా శ్రీనాథ్ ఘాటుగా రిప్లైలు ఇస్తున్నారు. ఈ వివాదం ఇంకెంత దూరం వెళుతుందో? ఇంకెంతమంది హీరోయిన్లు సందీప్‌రెడ్డి వంగాపై ఆగ్రహం వ్యక్తం చేస్తారో?