ENGLISH | TELUGU  

వారందరికీ ప్రేరణ వెంకటేషే..!

on Dec 13, 2017


హీరోల కొడుకులు హీరోలుగా సక్సెస్ అవ్వడం కామనే. ఎందుకంటే... వారి జీన్స్ లో నటన అనేది ఉంటుంది. అయితే..  ప్రస్తుతం నిర్మాతల కొడుకులు కూడా హీరోలైపోతున్నారు. నిజానికి వాళ్లు హీరోలవ్వడం పెద్ద పనేం కాదు. సక్సెస్ అవ్వడమే పెద్ద పని. ఎందుకంటే... బేసిగ్గా వాళ్లది నట కుటుంబం కాదు. వారి రక్తంలో నటన ఉండదు. అందుకే... హీరోలైనా సక్సెస్ అవ్వడం మాత్రం కష్టం.

అయితే... ఇది 30 ఏళ్ల కిందటి మాట. ఇప్పుడు కాదు. జగపతిబాబు నిర్మాత కొడుకే. నందమూరి కల్యాణ చక్రవర్తి నిర్మాత కొడుకే. తమిళ హీరోలు విజయ్, ధనుష్ లు నిర్మాతల కొడుకులే. హీరో రామ్ నిర్మాత ఇలాఖానే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిర్మాత కొడుకే. ఇంకా మిగతా భాషల్లో కూడా చాలామంది నిర్మాతల కొడుకులు హీరోలయ్యారు. కొందరు సక్సెస్ సాధిస్తే.. కొందరు మాత్రం బొక్క బోర్లా పడ్డారు. అసలు ఇలా ‘నిర్మాతల కొడుకులు హీరోలవ్వడం’ అనే ట్రెండ్ మొదలైంది ఎక్కడ్నుంచో తెలుసా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే మీకో కథ చెప్పాలి.

సూపర్ స్టార్ కృష్ణ హీరోగా  డి.రామానాయుడు ఓ చిత్రాన్ని నిర్మించాలనుకున్నారు. కథ కూడా ‘ఓకే’. కృష్ణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకొని సెట్స్ కి సినిమా వెళ్తుంది అనగా... కృష్ణ గారి నుంచి ఫోన్. గత కమిట్మెంట్ల వల్ల సినిమా చేయలేకపోతున్నానేది ఆ ఫోన్ ఆంతర్యం. నాయుడుగారికి ఏం తోచలేదు. ఇమిడియట్ గా సినిమా సెట్స్ కి వెళ్లాలి... ఎలా? దర్శకుడిగా కె.రాఘవేంద్రరావు కూడా రెడీగా ఉన్నాడు. ఇక వేరే ఆలోచన చేయకుండా ఏ నిర్మాత చేయని సాహసం చేసేశారు నాయుడు. అదే... అమెరికాలో ఉన్న తన చిన్న కుమారుడ్ని హైదరాబాద్ పిలిపించడం. ఈ లోగా సత్యానంద్ లాంటి కథారచయితలతో సిట్టింగ్స్ ఏర్పాటు చేసి... ఓ యంగ్ హీరోకు సరిపడా కథను సిద్దం చేయించేశాడు. చిన్న కొడుకు ఊళ్లోకి దిగీదిగగానే... తన కుమారుడు వెంకటేశ్ హీరోగా చిత్రం నిర్మిస్తున్నట్టు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. అలా... కృష్ణ కాదంటే... అనుకోకుండా హీరో అయిన దక్షిణాది తొలి నిర్మాత కుమారుడు విక్టరి వెంకటేశ్.

నిర్మాత కొడుకు హీరో అవ్వడం వరకూ ‘ఓకే’.  గొప్ప నటునిగా... స్టార్ గా ఎదగడమే ఇక్కడ విశేషం. ఈ ఫీట్ చేసిన తొలి హీరో కూడా వెంకటేశే. నటునిగా వెంకీది 32 ఏళ్ల నట ప్రస్థానం. ఈ మూడు దశాబ్దాల కాలంలో వెంకీ సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కాదు.

ఆయన కెరీర్ ని ఒక్కసారి పరిశీలిస్తే... తొలి సినిమా ‘కలియుగ పాండవులు’లో వెంకీ చూపించినంత అద్భతమైన నటన... హీరోల కొడుకులు కూడా చూపించలేదంటే నమ్ముతారా? పైగా రావుగోపాల్రావు కాంబినేషన్లో. దటీజ్ వెంకీ. అంతేకాదు..  స్టార్ గా ఎదిగాక చేయాల్సిన పాత్రలన్నీ కెరీర్ తొలినాళ్లలోనే చేసేశాడు  కెరీర్ తొలినాళ్లలో చేయాల్సిన నువ్వునాకు నచ్చావ్, ఆడవారిమాటలకు.. లాంటి సినిమాలను సీనియార్ హీరో అయ్యాక చేశాడు. నేటి హీరోల్లో నవరస నాయకుడంటే అది వెంకటేశ్ మాత్రమే. అందులో నో డౌట్. విషాదం ఎలా పండిస్తాడో ‘గణేశ్’ చూస్తే తెలుస్తుంది. కామెడీ ఎలా చేస్తాడో ‘నువ్వునాకు నచ్చావ్‘ చూస్తే అర్థమవుతుంది. ఎమోషన్ ఏ స్థాయిలో పలికిస్తాడో ‘ధర్మచక్రం’ చూస్తే తెలుస్తుంది. యాక్షన్ హీరోగా వెంకీ ఏంటో ‘శత్రువు’ చూస్తే అవగతం అవుతుంది. వెంకీలో క్లాసికల్ టచ్ ఏ స్థాయిలో ఉందో ‘స్వర్ణకమలం’ చూస్తే అర్థమవుతుంది. తెరపై ప్రేమికునిగా కూడా వెంకీ దిట్టే, ప్రేమ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలే అందుకు తార్కాణాలు.  ఇక దృశ్యం, గురు... వేటికవే ప్రత్యేకాలు.

మూడు దశాబ్దాల తన నట జీవితంలో ఒకే తరహా పాత్రలు వెంకీ ఎప్పుడూ చేయలేదు. సినిమా సినిమాకూ ఏదో ఒక వైవిద్యం చూపించడం వెంకీ స్టైల్. అందుకే... సక్సెస్ రేట్ లో కూడా మిగిలిన హీరోలతో కంపైర్ చేస్తే ది బెస్ట్ వెంకటేశ్.

వెంకీ ఇన్ స్పిరేషన్ తోనే చాలామంది నిర్మాతల కొడుకులు హీరోలుగా పరిచమై విజయం సాధించారు. కొందరు బొక్కబోర్లా పడ్డారు. అంటే. నటునిగానే కాదు.. కెరీర్ పరంగా కూడా వెంకీ ట్రెండ్ సెట్టర్ అనమాట.

నేడు వెంకటేశ్ పుట్టిన రోజు.  అంటే విక్టరీ పుట్టిన రోజున్నమాట. ఇలాంటి పుట్టిన రోజులు వెంకీ.. మరో వంద జరుపుకోవాలని  ఆకాంక్షిస్తుందీ... ‘తెలుగువన్’.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.