షాకిచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి ఫైనల్ రిపోర్ట్
on Feb 23, 2017
ఈ సంక్రాంతికి విడుదలై, అభిమానుల్ని అలరించిన చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. బాలయ్య వందో సినిమా కావడం వల్ల ఈ సినిమాపై ముందు నుంచీ భారీ అంచనాలున్నాయి. ఓ చారిత్రక గాథని, బాలయ్య ఇమేజ్‌కి తగ్గట్టుగా మలచడంలో క్రిష్ విజయం సాధించాడు, టేకింగ్, సంభాషణలు, అందులో బాలయ్య నట విశ్వరూపం, పైగా తెలుగు వారు చూడాల్సిన సినిమా కావడం, అన్నింటికి మించి సంక్రాంతికి విడుదల కావడం వల్ల ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి. ఈ సినిమా కచ్చితంగా బాలయ్య గత సినిమా రికార్డుల్ని తిరగరాస్తూ వంద కోట్ల దిశగా దూసుకుపోతుందని అభిమానులు భావించారు.
అయితే.. ఇప్పుడు ఈ సినిమా ఫైనల్ రిపోర్ట్ చూసి బాలయ్య అభిమానులే కాదు, ట్రేడ్ వర్గాలు కూడా విస్తుపోతున్నాయి. టోటల్‌గా గౌతమి పుత్ర శాతకర్ణికి రూ.49.5 కోట్ల వసూళ్లు దక్కాయి. అంటే.. మ్యాజిక్ ఫిగర్ రూ.50 కోట్లకు కాస్త తక్కువన్నమాట. వంద కోట్లు కొడతాడుకొంటే.. రూ.50 కోట్లు కూడా దాటలేదేంటంటూ.... బాలయ్య అభిమానులు తెగ నిరాశ పడిపోతున్నారు.
నైజాంలో ఈ చిత్రం దాదాపు 9.5 కోట్లు సాధించింది. ఓవర్సీస్లో రూ.7 కోట్ల వరకూ వచ్చింది. సీడెడ్‌లో రూ.8 కోట్లు వసూలు చేసింది. తొలి వారమే రూ.30 కోట్లు దాటినా, ఆ తరవాత పబ్లిసిటీ వదిలేయడం వల్ల ఈ సినిమా వసూళ్లు బాగా క్షీణించాయని తెలుస్తోంది. ఈ సినిమాకి దాదాపుగా రూ.55 కోట్ల వరకూ బడ్జెట్ అయ్యింది. వచ్చింది రూ.50 మాత్రమే. అంటే... ఎలా చూసినా రూ.5 కోట్లు నష్టమన్నమాట. శాటిలైట్ కూడా కలుపుకొంటారు కాబట్టి... స్వల్ప లాభాలతో సంతృప్తి పడాల్సివస్తోంది.