కరోనాపై తొలి సినిమా అదే!
on Mar 30, 2020
కరోనాపై హిందీలో ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ 'కరోనా ప్యార్ హై' టైటిల్ రిజిస్టర్ చేయించింది. కన్నడలో నిర్మాత ఉమేష్ 'కరోనా' టైటిల్ రిజిస్టర్ చేయించారు. హిందీలో ఆ సినిమాను 'డెడ్లీ కరోనా'గా విడుదల చేస్తామని అన్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కరోనాపై సినిమా సంగతులివి. ఇంటర్నేషనల్ సినిమా ఇండస్ట్రీకి వెళితే... ఆల్రెడీ కరోనాపై ఒక సినిమా రెడీ అయింది. ట్రైలర్ రిలీజ్ అయి రెండు వారాలు అయింది. ఇండియాలో కరోనా ఎఫెక్ట్ ఇప్పుడిప్పుడు ఎక్కువ అవ్వడంతో ఈ సినిమాపై ఇక్కడి ఇండస్ట్రీ, ఆడియన్స్ దృష్టి కూడా పడింది.
కెనడియన్-పర్షియన్ ఫిలింమేకర్ ముస్తఫా కేశ్వరి 'కరోనా' అని ఒక సినిమా తీశారు. 'ఫియర్ ఈజ్ ది వైరస్' (భయమే ఒక వైరస్) అని క్యాప్షన్ కూడా పెట్టారు. సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కించారట. సినిమా అంతా సింగిల్ షాట్ లో తీశామని చెబుతున్నారు. కథ విషయానికి వస్తే... ఒక అపార్ట్మెంట్లోని లిఫ్ట్‌లో ఏడుగురు ఇరుక్కుంటారు. వాళ్లలో ఒక్కొక్కరిదీ ఒక్కో జాతి, ఒక్కో నేపథ్యం. అందులో ఒక మహిళ చైనా మూలాలు ఉన్న వ్యక్తి. వైరస్ గురించి డిస్కషన్స్ వచ్చినప్పుడు కొందరు జాత్యహంకార ధోరణితో ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. తర్వాత ఏమైందనేది కథ అట.
కరోనాను 'చైనీస్ వైరస్' అని కొందరు కామెంట్ చేస్తున్న నేపథ్యంలో జాతి వివక్ష వంటి అంశాల నేపథ్యంలో ముస్తఫా సినిమా తీశారట. వైరస్ ఏ ఒక్క జాతికో చెందినది కాదనీ, అందరూ దీనిపై కలసికట్టుగా పోరాటం చేయాలనీ అతడు పిలుపు ఇచ్చాడు. ఈ ఏడాదే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నాడు.
Also Read