2020లో దిల్రాజు సిక్సర్ కొట్టడం గ్యారెంటీ
on Nov 25, 2019
టాలీవుడ్ ఫేమస్ ప్రొడ్యూసర్ దిల్రాజు సిక్సర్ కొట్టడం గ్యారెంటీ అంటునన్నారు. ఆరు ఏంటి? అంతకంటే ఎక్కువ కొట్టేలా ఉన్నానని ఆయన ధీమాగా చెబుతున్నారు. 2017లో దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుండి ఆరు సినిమాలు వచ్చాయి. అన్నీ విజయాలు సాధించాయి. అలాగే, 2020లో కూడా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుండి ఆరు కంటే ఎక్కువ సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే.... మొదటి మూడు నెలల్లో నెలకు ఓ సినిమా చొప్పున మూడు సినిమాలు విడుదల చేస్తున్నారు. అవేంటో చూడండి...
మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో అనిల్ సుంకరతో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది.
శర్వానంద్, సమంత జంటగా తమిళ హిట్ '96'ను తెలుగులో మాతృక తీసిన ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది.
నాని, సుధీర్ బాబు, అదితిరావ్ హైదరి, నివేదా థామస్ ప్రధాన తారాగణంగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'వి' చిత్రాన్ని మార్చి 25న దిల్ రాజు విడుదల చేయనున్నారు.
ఇవే కాకుండా దర్శకుడు వీవీ వినాయక్ ను హీరోగా పరిచయం చేస్తూ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతోన్న 'సీనయ్య' వచ్చే ఏడాది వేసవికి విడుదల కానుంది. 'జెర్సీ' హిందీ రీమేక్ వచ్చే ఏడాది విడుదల కానుంది. అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'ఐకాన్' ప్రకటించారు. ఇప్పటివరకు చెప్పుకున్నవి ఆరు సినిమాలు ఉన్నాయి. చిన్న హీరోలతో చకచకా సినిమాలు తీసే అవకాశం ఉంది. వెబ్ సిరీస్ లు కూడా చేస్తామని దిల్ రాజు చెబుతున్నారు.