వాన వచ్చింది.. చిరు హృదయం స్పందించింది!
on Apr 10, 2020
లాక్డౌన్ పీరియడ్‌ను టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి లాగా ఆస్వాదిస్తున్నవాళ్లు మరొకరు లేరేమో అనిపిస్తోంది.. ఆయన క్రమం తప్పకుండా సోషల్ మీడియాలో పంచుకుంటున్న విషయాలు చూస్తుంటే. ఇటీవల తన ఇంటి బయట వాతావరణం ఎలా ఉందో చూపించిన ఆయన తాజాగా మరోసారి అలాంటి ప్రాకృతిక విషయాన్ని వీడియో రూపంలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో పలుచోట్ల కొద్దిసేపు వర్షం కురిసింది. ఇంద్ర ధనుస్సులు వెరిశాయి. వాహనాలు తిరగకపోవడం, ఫ్యాక్టరీలు బంద్ కావడంతో కాలుష్యరహితమైన హైదరాబాద్‌లో ఆ వర్షం ప్రజలకు ఆహ్లదాన్ని పంచింది. మెగాస్టార్ సైతం ఆ వర్షానికి పులకరించారు. విరిసిన హరివిల్లు చూసి సంబరపడ్డారు. అందుకనే ఆయనలోని కవి హృదయం పొంగింది.
"వ్వావ్.. అనుకోకుండా వస్తున్న ఈ వర్షంతో చెట్లూ చేమలూ ఆకులూ పువ్వులూ ప్రతిదీ పులకరించిపోతున్నట్లుగా అనిపిస్తోంది. ఆ ఉరుములు, పడుతున్న వర్షం, ఎదురుగా సప్త వర్ణాలతో కనిపిస్తోన్న ఇంద్ర ధనుస్సు.. ఇవన్నీ ఏదో మానవాళికి ప్రకృతి శుభవార్త చెబుతున్నట్లుగా, చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఒక మంచి వార్త చెప్తున్నట్లుగా నాకనిపిస్తోంది. 'మీరు భయపడాల్సిన, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఈ మహమ్మారి మీ నుంచి శాశ్వతంగా దూరమైపోతుంది, దాన్నుంచి మీకు విముక్తి లభిస్తుంది. అందరూ మళ్లీ సంతోషంగా తిరుగుతారు, ఆనందంగా ఉంటార'నే భరోసా ఇస్తున్నట్లుంది. ఒకరకంగా ఈ లాక్డౌన్ పీరియడ్‌లో యావత్ప్రపంచం ప్రకృతిని పరోక్షంగా గౌరవించిందనే చెప్పాలి. అందుకనే ఎక్కడా పొల్యూషన్ లేదు. ఇదే కొనసాగితే బాగుంటుందనిపిస్తుంది. పుడమి తల్లి తన సంతోషాన్ని ఈ విధంగా తెలియజేస్తోందనిపిస్తోంది. ఇది ప్రకృతి తన హర్షాన్ని తెలియజేసే వర్షమే కానీ, రైతులకు హాని చేసే వర్షం కాదు, కాకూడదు" అంటూ తన ఇంటి ముందు ఆవిష్కరించిన సన్నివేశాన్ని వీడియోలో బంధించి, దానికి తన వ్యాఖ్యానాన్ని జోడించారు. ఈ వీడియోకు ఆయన #RainbowThoughts అనే క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.