English | Telugu

'బిగ్ బాస్' విన్నర్ అయితే అంతే సంగతులా? రాహుల్ సిప్లిగంజ్ పరిస్థితి ఏంటి?

on Nov 16, 2019

 

'బిగ్ బాస్' రియాలిటీ గేమ్ షో మన దేశంలో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఇంటర్నేషనల్ గేమ్ షో 'బిగ్ బ్రదర్'కు అనుసరణగా వచ్చిన 'బిగ్ బాస్' షో.. హిందీలో ఇప్పటికి 13 సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకోగా, తెలుగులో 3, తమిళంలో 3 సీజన్లను పూర్తి చేసుకుంది. స్టార్ మా చానల్‌లో అత్యధిక టీఆర్‌పీ సాధించిన రియాలిటీ షో.. బిగ్ బాసే. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ అవడంతో, నాని హోస్ట్‌గా రెండో సీజన్‌ను ప్రసారం చేసింది మా చానల్. అది కూడా సక్సెస్ అవడంతో లేటెస్టుగా మూడో సీజన్‌ను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేసింది. ఈ సీజన్‌కు కింగ్ నాగార్జున హోస్టుగా వ్యవహరించారు. టీఆర్పీ విషయంలో మునుపటి రెండు సీజన్ల రికార్డుల్ని ఈ సీజన్ బద్దలు కొట్టిందని ఆ షో నిర్వాహకులు ప్రకటించారు.

ఇంతవరకూ బాగానే ఉంది కానీ, 'బిగ్ బాస్' హౌస్‌లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న వాళ్ల పరిస్థితి, ఆ తర్వాత కాలంలో ఏమంత బాగోలేదనే విషయం ప్రచారంలోకి వచ్చింది. ముఖ్యంగా సీజన్ విన్నర్స్‌గా నిలిచిన వాళ్లు, ఆ తర్వాత కాలంలో ఏమైపోయారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆరా తీస్తున్నారు. 'బిగ్ బాస్ 1' విన్నర్ అయిన ఫిల్మ్ యాక్టర్ శివబాలాజీ కానీ, 'బిగ్ బాస్ 2' విన్నర్‌గా నిలిచిన యాక్టర్ కౌశల్ కానీ.. తర్వాత పత్తా లేకుండా పోయారంటూ నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. అదివరకు ఒకదాని తర్వాత ఒకటైనా సినిమాలు చేసుకుంటూ కనిపించే శివబాలాజీ.. 'బిగ్ బాస్' ఫస్ట్ సీజన్‌లో కంటెస్టెంటుగా పాల్గొని మంచి ప్రచారం పొందాడు. యాక్టర్లు ధన్‌రాజ్, సంపూర్ణేష్‌బాబు, అర్చన, జ్యోతి, ఆదర్శ్ బాలకృష్ణ, సమీర్, ముమైత్ ఖాన్, టీవీ యాంకర్స్ హరితేజ, కత్తి కార్తీక, సింగర్స్ కల్పన, మధుప్రియ, ఫిల్మ్ క్రిటిక్ మహేశ్ కత్తి వంటి మహామహులతో పోటీపడ్డ శివబాలాజీ విన్నర్‌గా నిలిచాడు. గెలిచే ముందు, తర్వాత అతనికి మీడియాలో లభించిన ప్రచారం అంతా ఇంతా కాదు. చిత్రంగా ఆ తర్వాత అతను పెద్దగా సినిమాల్లో కనిపించింది లేదు. హీరోగా, సైడ్ హీరోగా, కీలక పాత్రధారిగా అంతవరకూ చాలా సినిమాల్లో నటించిన శివబాలాజీకి 'బిగ్ బాస్' విన్నర్ అయ్యాకే సినిమా అవకాశాలు తగ్గాయని ఫిలింనగర్ జనాలు భావిస్తున్నారు. 2017లో వచ్చిన 'కాటమరాయుడు' సినిమాలో పవన్ కల్యాణ్ తమ్ముడిగా ప్రాధాన్యం ఉన్న పాత్ర చేసిన అతనికి ఇంతదాకా మరే పేరుపొందిన సినిమాలోనూ అవకాశం వచ్చినట్లు లేదు. 

'బిగ్ బాస్ 2' విన్నర్ అయిన యాక్టర్ కౌశల్ పరిస్థితీ దీనికి భిన్నం కాదు. మోడల్‌గా, యాక్టర్‌గా బిజీగా ఉండే కౌశల్.. 'బిగ్ బాస్ 2'లో హౌస్‌మేట్‌గా మిగతా కంటెస్టెంట్లతో పోటీ పడ్డాడు. మొదట్నించీ ఒక పద్ధతి ప్రకారం గేమ్స్ ఆడి, 'కౌశల్ ఆర్మీ' పేరుతో బయట ఒక్ గ్రూప్‌ను తయారుచేసుకొని, మీడియాలో తనకు విస్తృతంగా పబ్లిసిటీ వచ్చేలా చేసుకొని ఫైనల్స్‌కు చేరుకున్నాడు. అమిత్ తివారి, భానుశ్రీ, దీప్తి సునైన, తనీష్, కిరీటి దామరాజు, తేజస్వి మదివాడ, సమ్రాట్‌రెడ్డి, నందినీ రాజ్, పూజా రామచంద్రన్ వంటి యాక్టర్లు, దీప్తి నల్లమోతు, శ్యామల వంటి టీవీ యాంకర్లు, గీతా మాధురి, రోల్ రిడా వంటి సింగర్లు, బాబు గోగినేని, గణేశ్, సంజన అన్నే, నూతన్ నాయుడు వంటి సోషల్ పీపుల్ పాల్గొన్న ఈ సీజన్‌లో కౌశల్ విజేతగా నిలవడం చాలామందిని ఆశ్చర్యపరచింది. ఆ సమయంలో అతనికి కూడా విపరీతమైన ప్రచారం లభించింది. ఆశ్చర్యకరంగా.. ఆ తర్వాత అతను కూడా ఎక్కడా కనిపించలేదు. ఏ సినిమాల్లో అవకాశాలు లభించాయో తెలీదు. ఒక రేంజిలో పబ్లిసిటీ పొందిన అతను ఇవాళ, ఆ పబ్లిసిటీకి పూర్తిగా దూరంగా ఉండటం, ఆశించిన రీతిలో సినిమా అవకాశాలు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

ఇక ఇప్పుడు ఆ పరిస్థితి సింగర్, మ్యూజిక్ కంపోజర్ రాహుల్ సిప్లిగంజ్‌కు రానున్నదా అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. నిజానికి 'బిగ్ బాస్ 3' హౌస్‌మేట్ కాకముందు రాహుల్‌కు ఒక సింగర్‌గా సాధారణ ప్రేక్షకుల్లో పెద్ద పేరు లేదు. కానీ యూత్‌లో, మ్యూజిక్ లవర్స్‌లో అతనికి ఇమేజ్ ఉంది. కారణం.. అతను తీసుకు వచ్చిన మ్యూజిక్ వీడియోస్. 'హిజ్రా', 'హే పిల్లా', 'హైదరాబాదీ బతుకమ్మ', 'మాక్కీ కిర్‌కిరి', 'మంగమ్మా', 'ఎందుకే', 'పూర్ బాయ్' వంటి ప్రైవేట్ వీడియో సాంగ్స్‌తో అతను ఫేమస్ అయ్యాడు. సినిమాల్లో అడపదడపా పాడుతూ వస్తున్నాడు. 'బిగ్ బాస్ 3'లో అతను ఫైనల్స్‌కి రావడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. హేమ, రవికృష్ణ, అలీ రెజా, మహేశ్ విట్టా, శ్రీముఖి, వరుణ్ సందేశ్, వితికా శేరు, హిమజ, రోహిణి, పునర్ణవి భూపాలం వంటి యాక్టర్లు, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, యాంకర్ శివజ్యోతి, సోషల్ మీడియా పర్సనాలిటీ అషురెడ్డి, టీవీ జర్నలిస్ట్ జాఫర్ వంటి వాళ్లు కంటెస్టెంట్లుగా పాల్గొన్న ఈ సీజన్‌లో విజేతగా నిలిచి రాత్రికి రాత్రి స్టార్ అయిపోయాడు రాహుల్. రెండు వారాలు గడిచాయి. 

ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ పరిస్థితి ఏమిటంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. శివబాలాజీ, కౌశల్‌కి ఎదురైన పరిస్థితే అతనికీ ఎదురవుతుందా? అని ప్రశ్నించుకుంటున్నారు. సినిమా అవకాశాల పరంగా చూస్తే.. తాజాగా అతనికి 'అల.. వైకుంఠపురములో' సినిమాలో 'ఓ మై గాడ్ డాడీ' అనే పాట పాడే అవకాశం వచ్చింది. ఐదుగురు సింగర్స్‌లో ఒకడిగా అతను ఆ పాట పాడాడు. అయితే ఒక బ్యాగ్ లాంటి ఆఫర్ కోసం అతను ఎదురు చూస్తున్నాడు. స్వతహాగా కంపోజర్ కూడా కాబట్టి, మ్యూజిక్ డైరెక్షన్ ఛాన్సుల కోసం చూస్తున్నాడు. సమీప కాలంలో అలాంటి అవకాశాలు అతనికి లభిస్తాయా? లేక.. మునుపటి విన్నర్స్ తరహాలోనే అతడూ లైంలైట్‌కి దూరంగా ఉండిపోతాడా? లెటజ్ వెయిట్ అండ్ సీ..


Cinema GalleriesLatest News


Video-Gossips