మళ్లీ ఇక్కడ నాగార్జున.. అక్కడ కమల్ హాసన్ 'బిగ్ బాస్ 3'
on Apr 1, 2020
'యమలీల' సినిమాలో తోటరాముడు (తనికెళ్ల భరణి నటించిన పాత్ర) ఓ కవిత రాసి వినిపిస్తాడు. గుర్తుందా? 'నాకో బుల్లి చెల్లి.... నేడే గల్లీలో దానికి పెళ్లి! ఇలా నా చెల్లికి పెళ్లి... జరగాలి మళ్లీ మళ్లీ' అని. కరోనా కొట్టిన దెబ్బకు ప్రస్తుతం టీవీ చానళ్లు ఇటువంటి కవితను వినిపిస్తున్నాయి. 'మా దగ్గరో షో ఉంది... ఆల్రెడీ టెలికాస్ట్ అయింది! తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని టెలికాస్ట్ చేయాలి మళ్లీ మళ్లీ' అన్నట్టున్నాయి. దూరదర్శన్‌లో 'రామాయణ్' సీరియల్‌ను మళ్లీ టెలికాస్ట్ చేస్తున్నారు. 'మహాభారత్', 'శక్తిమాన్' కూడా మళ్లీ బుల్లితెర మీదకు వస్తున్నాయి.
తెలుగునాట, తమిళనాడులో శాటిలైట్ చానళ్ళు దూరదర్శన్ బాటలో నడవాలని నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే కొన్ని ఛానళ్లు పాత సీరియళ్లను టెలికాస్ట్ చేస్తున్నాయి. విశేషం ఏంటంటే... గత ఏడాది ప్రసారం అయిన 'బిగ్ బాస్ 3' రియాలిటీ షోను మళ్లీ రెండు భాషల్లోనూ టెలికాస్ట్ చేయాలని నిర్ణయించుకోవడం. తెలుగులో నాగార్జున హోస్ట్ చేసిన ఈ షో సోమవారం (మార్చి 30) మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం అయ్యింది. ప్రతి వారం సోమవారం నుంచి శనివారం వరకు ఇది ప్రసారమవుతుందని స్టార్ మా చానల్ ప్రకటించింది.
అదే విధంగా తమిళంలో కమల్ హాసన్ హోస్ట్ చేసిన ఈ షో, ప్రతి రోజూ సాయంత్రం ఆరున్నర గంటలకు టెలికాస్ట్ చేయనున్నట్టు విజయ్ టీవీ తెలియజేసింది. ఇదే కాకుండా తమిళంలో కొన్ని టాక్ షోలను కూడా మళ్లీ టెలికాస్ట్ చేస్తున్నారు. 'పట్టిమండ్రంస్' వంటి స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా మళ్లీ టెలికాస్ట్ అవుతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఉదయం నుండి ఎక్కువ సమయాల్లో సినిమాలు వేస్తున్నారు.
Also Read