కన్నడ సీమ నుంచి మరో భారీ సినిమా వస్తోంది!
on Nov 28, 2019
'కేజీఎఫ్' సినిమాతో కన్నడ హీరో యష్ దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు. తెలుగులోనూ ఆ సినిమా ఘన విజయం సాధించి యష్‌కు క్రేజ్ తీసుకొచ్చింది. దానికి సీక్వెల్ తయారవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే కన్నడ నేల నుంచి మరో భారీ, ఆసక్తికర సినిమా వస్తోంది. దాని పేరు 'అతడే శ్రీమన్నారాయణ'. 'కిరిక్ పార్టీ'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన రక్షిత్ సెట్టి ఈ మూవీలో టైటిల్ రోల్ పోషించాడు. 'లవ్లీ' సినిమాతో తెలుగులో నాయికగా పరిచయమైన శాన్వి శ్రీవాస్తవ ఈ మూవీలో హీరోయిన్. కన్నడంలో 'అవనే శ్రీమన్నారాయణ'గా తయారైన ఈ మూవీకి సచిన్ డైరెక్టర్. దీన్ని కన్నడ ఒరిజినల్ వెర్షన్‌తో పాటుగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈరోజు (నవంబర్ 28) ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
ఒక నిధి అన్వేషణ నేపథ్యంలో సాగే ఈ కథలో హీరో ఒక పోలీసుగా కనిపించాడు. ట్రైలర్‌ను చూస్తే.. 'అతడే శ్రీమన్నారాయణ'ను ఎంత గ్రాండియర్ స్కేల్లో తీశారో అర్థమవుతుంది. రెండు కాలాల్లో ఈ సినిమా కథ నడుస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. పాత కాలానికి సంబంధించిన వాతావరణాన్ని క్రియేట్ చెయ్యడానికి, అప్పటి వాహనాలు, కాస్ట్యూమ్స్‌కు చాలా ఖర్చు పెట్టినట్లు కనిపిస్తోంది. 4 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్లో నిధి కోసం కొన్ని గ్యాంగులు అన్వేషణ సాగిస్తాయనీ, అన్వేషణ అనే ఆ ఆటలో ఎత్తులు పై ఎత్తులు, ఒకర్నొకరు చంపుకోవడాలు వంటివి ఉంటాయని తెలుస్తోంది. "ఆడుతూ వెళ్తే వెయ్యి ఎత్తులు.. వెతుకుతూ వెళ్తే వెయ్యి సమాధానాలు" అనే శ్రీమన్నారయణ డైలాగ్, అతడి చేస్టలు చూస్తే, ఆ క్యారెక్టర్లోనే ఎంటర్టైన్మెంట్ ఉన్నట్లు గ్రహించవచ్చు. దాంతో పాటు అతడు చేసే ఫైట్లు కూడా ఈ సినిమాకు ఆకర్షణ కానున్నాయి. ఈ సినిమాకి రచన చేసింది కూడా ఆ పాత్రధారి రక్షిత్ శెట్టి కావడం గమనార్హం. తెలుగు వెర్షన్ పాటలన్నింటినీ రామజోగయ్య శాస్త్రి రాశారు. డిసెంబర్ 27న ఈ మూవీ విడుదల కానున్నది. ఇది కూడా 'కేజీఎఫ్' తరహాలో సంచలన విజయం సాధిస్తుందా.. వెయిట్ అండ్ సీ.