ఎబిసిడి... ఎన్ఆర్ఐ 'పిల్ల జమిందార్'?
on Apr 15, 2019
'పిల్ల జమిందార్' సినిమా చూశారు కదా! అందులో హీరో నాని క్యారెక్టర్ గుర్తుందా? అల్లు శిరీష్ హీరోగా నటించిన 'ఎబిసిడి' ట్రైలర్ చూస్తే... ఆ సినిమా గుర్తుకు రావడం ఖాయం! హీరో క్యారెక్టర్ తో పాటు కొన్ని సన్నివేశాలు సేమ్ టు సేమ్ ఉన్నట్టు అనిపిస్తాయి. జమీందార్ల కుటుంబంలో పుట్టిన నాని, ఓ పల్లెటూరుకి వచ్చి... లగ్జరీ లైఫ్ కి దూరంగా డిగ్రీ పూర్తి చేయడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు అనేది 'పిల్ల జమిందార్'లో వినోదాత్మకంగా చూపించారు. 'ఎబిసిడి' ట్రైలర్ విషయానికొస్తే... ఎన్ఆర్ఐ కుర్రాడు ఇండియా వచ్చి లగ్జరీ లైఫ్ కి దూరంగా చదువుకుంటున్నట్లు చూపించారు. రాజకీయాలు గట్రా ఉన్నాయి. 'పిల్ల జమిందార్'లో కూడా రాజకీయాలు ఉన్నాయి. అయితే అవి కాలేజ్ రాజకీయాలు! రెండు సినిమాల మధ్య చాలా సారూప్యతలు కనిపిస్తున్నాయి. విచిత్రం ఏంటంటే... 'ఎబిసిడి' సినిమా మలయాళంలో అదే పేరుతో రూపొందిన సినిమాకు రీమేక్. సేమ్ టు సేమ్... మక్కీకి మక్కీ దించేశారు అన్నట్టు కాకుండా... తెలుగు సినిమాలో కొన్ని మార్పులు చేశారట. కమర్షియల్ హంగులు జోడించి తీశామని చిత్రబృందం చెబుతోంది. మే 17న ఈ సినిమా విడుదలవుతోంది.