ENGLISH | TELUGU  

అక్కినేని ఓ అద్భుతం!

on Jan 21, 2018

తెలుగు సినిమాకు పోటీని నేర్పిన వ్యక్తి ఆయన...

తెలుగు సినిమాకు గ్లామర్ రూచి చూపించిన రొమాంటిక్ కింగ్ ఆయన..

దేవదాసైనా... కాళిదాసైనా... మహాకవి క్రేత్రయ్య అయినా.. తెనాలి రామకృష్ణ అయినా..

తెలుగు ప్రేక్షకులకు టక్ మని గుర్తొచ్చే రూపం ఆయన.

క్రమశిక్షణ, నిరాడంబరత, పట్టుదల, ఆత్మస్థైర్యం, కృషి..... ఈ పదాలకు పర్యాయపదం ఆయన...

ఆయనే... దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. పద్మవిభూషణ్, నటసామ్రాట్... డా.అక్కినేని నాగేశ్వరరావు.

నాలుగేళ్ల క్రితం ఇదే రోజున ఆ మహానటుడు మనల్ని వదిలి ... తిరిగిరాని లోకాలకు తరలివెళ్లారు. తెలుగు ప్రేక్షకులకు మరపురాని జ్ఙాపకంగా నిలిచిన ఆ మహామనిషిని కాసేపు స్మరించుకోవడం తెలుగువారిగా మనందరి ధర్మం.  

‘తనేంటో తెలుసుకొని... తన పరిథినెరిగి మసలేవాడు స్థితప్రజ్ఙుడు’ అన్నారు పెద్దలు. ఈ మాటను తూచా తప్పక పాటించిన మేటి నట శిఖరం అక్కినేని నాగేశ్వరరావు. తెలుగు తెర అప్పుడప్పుడే వెలుగు నింపుకుంటున్నసమయంలో పరిచయమమైన అక్కినేని.... మహానట దిగ్గజాలైన చిత్తూరు నాగయ్య, సీయస్ఆర్ ఆంజనేయులు, నారాయణరావు...లను సైతం వెనక్కు నెట్టి... నంబర్ వన్ అనిపించుకున్నారు.

తగిన పాత్రలను ఎంచుకుంటూ..  ఎన్టీయార్ లాంటి మహానటుడ్ని ఢీ కొంటూ... ‘నువ్వానేనా’ అనే స్థాయిలో 35 ఏళ్ల పాటు అలుపెరగని పోరాటాన్నే చేశారు. ఆ విధంగా తెలుగు తెరకు పోటీ అంటే ఏంటో రుచి చూపించిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు.

తెలుగు సినిమా స్వర్ణయుగంలో సగభాగం అక్కినేనిదే అంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. బాలరాజు, కీలుగుర్రం, దేవదాసు, తెనాలి రామకృష్ణ, బాటసారి, జయభేరి, విప్రనారాయణ, మనసేమందిరం, వెలుగు నీడలు, ప్రేమనగర్, ప్రేమాభిషేకం... ఇలా చెప్పుకుంటూ పోతే.. అది ఓ పుస్తకమే అవుతుంది.

తెలుగు సినిమా అస్థిత్వం కోసం పోరాటం చేసిన యోధుడు కూడా అక్కినేనే. తమిళనాట అవమానాలను ఎదుర్కొంటున్న తెలుగు సినిమాను... తెలుగు నేలవైపు నడిపించిన ఆత్మగౌరవ ప్రతీక ఆయన.

ముందు అక్కినేని నడిస్తే... అదే దారిలో తెలుగు సినిమానే నడిచింది.  
హైదరాబాద్ కొండపై ఆయన ఓ స్టూడియో నిర్మిస్తే... ఆ కొండ కింద కృష్ణానగర్ అనే ఓ సినీ కళాకారుల ఆవాసమే ఏర్పడింది.

ఆయన ఉన్నాడన్న ధైర్యం.. ఉంటాడన్న నమ్మకంతోనే... ఫిలింనగర్ పుట్దింది.
ఈ విషయంలో తన సమకాలీన కథానాయకుడైన ఎన్టీయార్ సైతం అక్కినేనినే అనుసరించాడంటే.. ఆయన పట్టుదల ఏపాటితో అర్థం చేసుకోవచ్చు.

‘మరణం ఓ ధర్మం. ఆ ధర్మాన్ని ఎవరైనా అనుసరించాల్సిందే’ అని చెప్పడం కాదు.. చేసి చూపించారు అక్కినేని. ‘నాకు కేన్సర్.. దయచేసి నా ఇంటికి ఎవరూ రావొద్దు. నన్నెవరూ పరామర్శించొద్దు. ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్న నేను...ఈ సమస్యను సైతం అధిగమించగలనన్న నమ్మకం నాకుంది. కాల నిర్ణయానికి అందరం బద్ధులమే. ‘ అని ముందుగా తెలుగు ప్రజలకు మీడియా సాక్షిగా తెలియజేసిన రణజన్ముడాయన.

పేద రైతు కుటుంబంలో పుట్టి ఓ పరిశ్రమగా మారిన అక్కినేని జీవితం ఓ అద్భుతం

అయిదో తరగతి చదివిన అక్కినేని... అమెరికా సదస్సులు అనర్గళంలో ఆంగ్లోపన్యాసం ఇవ్వడం మరో అద్భుతం

ఎన్టీయార్ లాంటి అందగాడ్నీ.. మహానటుడ్ని ఢీకొట్టి.. 35 ఏళ్లు పోరాడి.. ధీటుగా నిలవడం ఇంకో అద్భుతం

అపురూపమైన పాత్రలతో దేశం గర్వించదగ్గ మహానటుల్లో ఒకనిగా నిలవడం మహాద్భుతం

తెలుగు సినీ రాజధానికి తానే ఓ మార్గదర్శకునిగా నిలవడం అద్భుతాలకే అద్భుతం..

మరణాన్ని ఓ ధర్మంగా ఆరచరించి.. భావితరాలకు ఓ గొప్ప సందేశాన్నివ్వడం మరపురాని అద్భుతం...

మొత్తంగా అక్కినేనే... ఓ అద్భుతం...  జోహార్ అక్కినేని.. జోహార్.

 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.