అఖిల్ మళ్లీ ప్రేమలో పడ్డాడా?
on Sep 19, 2020
నాగార్జున చిన్నకొడుకు అఖిల్ మరోసారి ప్రేమలో పడ్డాడా? అవునంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. గతంలో ఒకసారి శ్రేయా భూపాల్‌తో ప్రేమలోపడి, ఎంగేజ్మెంట్ కూడా చేసుకొని, తర్వాత దాన్ని రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. అది జరిగి మూడేళ్లయిపోయింది. ఆ తర్వాత శ్రేయ మరొకరితో ఏడడుగులు నడిచింది. ఆ ఉదంతం తర్వాత అఖిల్ ప్రొఫెషనల్ కెరీర్‌పై ఫోకస్ పెట్టాడు. మూడు సినిమాలు చేసినా ఇంతవరకూ హిట్ కొట్టలేకపోయిన అతడు, ఎలాగైనా హీరోగా తనదైన ముద్రను వేయాలనే తపనతో స్క్రిప్టుల విషయంలో మరింత శ్రద్ధ చూపిస్తున్నాడు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా చేస్తున్న అతను, అది విడుదల కాకముందే సురేందర్ రెడ్డి డైరెక్షన్లో సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు.
ప్రొఫెషనల్‌గా అఖిల్ పరిస్థితి అలా ఉండగా, ఇప్పుడు మరోసారి అతని వ్యక్తిగత జీవితం గురించి ఆన్లైన్లో మరోసారి ప్రచారం మొదలైంది. లాక్డౌన్ పీరియడ్‌లో అఖిల్ ఓ వ్యాపారవేత్త కుమార్తెతో లవ్‌లో పడ్డాడనేది ఆ ప్రచార సారాంశం. కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరస్పరం పరిచయమైన వాళ్లిద్దరూ ఈ కాలంలో అప్పుడప్పుడు కలుసుకుంటూ, ఒకరి అభిరుచులు, అభిప్రాయాలు మరొకరు పంచుకుంటూ వస్తున్నారని చెప్పుకుంటున్నారు. త్వరలోనే వారి ఎంగేజ్మెంట్ జరగనుందనీ, సురేందర్ రెడ్డి డైరెక్షన్లో చేసే సినిమా పూర్తయ్యాక వివాహం చేసుకుంటాడనీ ప్రచారం జరుగుతోంది. అయితే అక్కినేని ఖాన్దాన్ నుంచి ఈ ప్రచారంపై ఎలాంటి స్పందనా రాలేదు. ఈ ప్రచారం ఉత్త రూమరేనా, లేక నిజమని తేలుతుందా.. చూడాలి.
Also Read