అఖిల్.. ఈ సారి ఆరు నెలలే!
on Apr 8, 2021
`సిసింద్రీ`(1995)గా బుడిబుడి అడుగుల ప్రాయంలోనే బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు అక్కినేని అఖిల్. ఇక `అఖిల్`(2015)తో కథానాయకుడిగా తెరంగేట్రం చేసిన ఈ యంగ్ హీరో.. ఆపై `హలో` (2017), `మిస్టర్ మజ్ను` (2019) చిత్రాలతో పలకరించాడు. ఈ మూడు సినిమాలు కూడా ఆశించిన విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో.. జూన్ 19న విడుదల కానున్న `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్`పైనే ఆశలు పెట్టుకున్నాడు అఖిల్.
ఇదిలా ఉంటే.. అఖిల్ పుట్టినరోజు (ఏప్రిల్ 8) సందర్భంగా నేడు తన కొత్త చిత్రం `ఏజెంట్` తాలూకు ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ రివీల్ చేశారు. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి రూపొందిస్తున్న ఈ యాక్షన్ డ్రామా.. డిసెంబర్ 24న థియేటర్స్ లో సందడి చేయనుంది. అంటే.. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్`, `ఏజెంట్`కి మధ్య కేవలం ఆరు నెలల గ్యాప్ మాత్రమే ఉందన్నమాట. ఇది అక్కినేని అభిమానులకు ఆనందాన్నిచ్చే అంశమే. ఎందుకంటే.. హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సినిమా సినిమాకి మధ్య ఏడాది లేదా రెండేళ్ళ గ్యాప్ ఇస్తూ పలకరిస్తూ వస్తున్న అఖిల్.. ఈ సారి తక్కువ సమయంలోనే రెండు చిత్రాలతో సందడి చేయబోతున్నాడు మరి.
మరి.. 2021 క్యాలెండర్ ఇయర్ అఖిల్ కి ఎలాంటి ఫలితాలను అందిస్తుందో చూడాలి.