బర్త్‌డే గిఫ్ట్ ఇస్తానన్న అఖిల్‌తో అమ్మ అమల ఏం చెప్పింది?
on Sep 21, 2020
అఖిల్ అమ్మ కొడుకా, నాన్న కొడుకా? "సినిమాలకు వచ్చేసరికి నాన్న కొడుకుని, ఇంట్లో అమ్మ కొడుకుని." అంటాడు అఖిల్. అతని విషయంలో అమ్మ అమల గైడెన్స్ ఎక్కువే. నాన్న నాగార్జున సినిమాలతో బిజీ కాబట్టి అమ్మతో గడిపినంత టైమ్ నాన్నతో గడపలేదు అఖిల్. "నాన్న షూటింగ్‌కు వెళ్లి సాయంత్రం వచ్చేవారు. కలిసి డిన్నర్ చేసేవాళ్లం. హాలిడేస్కి ఎక్కడికైనా వెళ్లేవాళ్లం." అని అతను చెప్పాడు.
ప్రతి ఇంట్లో మాదిరిగానే అమ్మతో అఖిల్‌కు అనుబంధం ఎక్కువ. "నాన్నతో చెప్పడానికి భయపడే విషయాలను అమ్మతో చెప్పేవాడ్ని. తర్వాత్తర్వాత అనుభవంలో నాన్న కూడా అమ్మలాగా క్లోజ్‌గా ఉంటారనీ, ఎంకరేజ్ చేస్తారనీ అర్థమైంది. నేనేం చేసినా అమ్మ, నాన్న ఇద్దరూ ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఏం చెయ్యాలనుకుంటే అది చెయ్యమనేవాళ్లు. నిజంగా నేను అదృష్టవంతుడ్ని." అని అతను తెలిపాడు.
అమల తన జీవితాన్ని బ్లూ క్రాస్‌కు అంకితం చేశారు. "జంతువుల కోసం అంత సర్వీస్ చేయడం మామూలు విషయం కాదు. ఖరీదైన బట్టలనేవి వేసుకోకుండా సింపుల్‌గా ఉంటుంది. తన బర్త్‌డే కోసం నేనో గిఫ్ట్ కొందామనుకుంటే అదేమీ వద్దనీ, ఆ డబ్బుని బ్లూ క్రాస్‌కు ఇస్తే తనెంతో సంతోషిస్తాననీ చెప్పింది. అలాంటి అమ్మకు కొడుకైనందుకు సంతోషంగా ఉంది." అని సంబరపడ్డాడు అఖిల్. సెప్టెంబర్ 12న అమల 53వ పుట్టినరోజును జరుపుకున్నారు.
ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీని చేస్తున్న అతను, దాని తర్వాత సురేందర్ రెడ్డి డైరెక్షన్లో సినిమా చేసేందుకు కమిట్ అయ్యాడు.