English | Telugu

ఏయన్నార్ ఇంటికి దణ్ణం పెట్టుకునేదాన్ని: రేఖ

on Nov 18, 2019

రేఖ అందంగా ఉంటారు. ఆమెది ముగ్ద మనోహరమైన మోము. అంతేనా? ఆమె తెలుగు పలుకులూ అంతే అందంగా ఉంటాయి. ఆదివారం ఏయన్నార్ జాతీయ పురస్కారం అందుకున్న సందర్భంగా రేఖ తెలుగులో మాట్లాడుతుంటే వేదిక పైన ఉన్న అతిథులు చిరంజీవి, టి. సుబ్బరామిరెడ్డితో పాటు అక్కినేని కుటుంబం, వేదిక ముందున్న ప్రేక్షకులు, టీవీల ముందున్న వీక్షకులు కళ్ళు అప్పగించారు. ఆమె అంత అందంగా మాట్లాడారు. గులాబీ మొక్కకు అంటు కట్టినట్టు! తల్లితండ్రుల జీన్స్, ప్రేక్షకుల ప్రేమాభిమానాలు తన అందానికి కారణమని ఆమె అన్నారు.

అక్కినేనితో తనకున్న అనుబంధాన్ని రేఖ గుర్తు చేసుకున్నారు. "మా చిన్నాన్న వేదాంతం రాఘవయ్య గారు చెబుతుండేవారు. 'ఆ అబ్బాయికి సిగ్గు గానీ కెమెరా ముందుకొస్తే ఇరగదీస్తాడు' అని. అమ్మను 'ఆ అబ్బాయి' ఎవరు? అని అడిగా. అక్కినేని నాగేశ్వరరావు అని చెప్పింది. తర్వాత ఆయన నటించిన 'సువర్ణ సుందరి' చూశా. నేను చూసిన తొలి చిత్రమిది. తర్వాత వందసార్లైనా చూసి ఉంటాను. నాకు సినిమా పిచ్చి పట్టేసింది. ఆ సినిమా చూసే సినిమా అంటే ఏంటో తెలుసుకున్నాను. నేను నటి కావడానికి అక్కినేని, అంజలి అత్తయ్య కారణం. నటి అయ్యాక, అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ చేసేటప్పుడు అక్కినేని గారి ఇంటి ముందు వెళుతూ, ఆ ఇంటికి దణ్ణం పెట్టుకునేదాన్ని. అక్కినేనిగారిని ఎప్పుడు కలుస్తానా? అని ఎదురుచూసేదాన్ని. ఒకరోజు ఆయన ఇంటికి పిలిచారు. భోజనం చేస్తూ చాలా విషయాలు మాట్లాడుకున్నాం" అని రేఖ అన్నారు.

రేఖకు ఏడాది వయసు ఉన్నప్పుడు 'ఇంటిగుట్టు'లో నటించారు. బాలనటిగా 'రంగులరాట్నం' చేశారు. కథానాయికగా హిందీ సినిమాలు ఎక్కువ చేశారు. అయితే, తెలుగులో కథానాయికగా నటించిన ఆమె తొలి సినిమా 'అమ్మ కోసం'. రేఖ తల్లి పుష్పవల్లి తెలుగు బిడ్డ. తన బిడ్డ తెలుగు సినిమా చేయాలని ఆమె కోరుకున్నారు. అందుకోసం మళ్ళీ తెలుగులో నటిస్తానని రేఖ అన్నారు. "మా అమ్మ నన్నెప్పుడూ తెలుగులో ఒక్క సినిమా చేయమ్మా అనేది. ఆమె ఆసుపత్రిలో ఉన్నప్పుడు నన్ను తెలుగులో సినిమా చేయమని కోరింది. అమ్మ కోసం మరోసారి తెలుగు సినిమా చేస్తా. స్పష్టంగా తెలుగు నేర్చుకుని సినిమా చేస్తా" అని రేఖ అన్నారు. ఆమె కోసం దర్శక, రచయితలు ప్రత్యేకంగా పాత్రలు రాసుకోవచ్చు అన్నమాట.


Cinema Galleries



Latest News


Video-Gossips