English | Telugu

తెనాలి రామ‌కృష్ణ బిఏ బిఎల్ మూవీ రివ్యూ

on Nov 15, 2019

నటీనటులు: సందీప్ కిషన్, హన్సిక, వరలక్ష్మీ శరత్ కుమార్, మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి, సత్యకృష్ణన్, వెన్నెల కిషోర్, అయ్యప్ప శర్మ తదితరులు
పాటలు: భాస్కరభట్ల, చిలక రెక్క గణేష్
మాటలు: భవానీ ప్రసాద్, నివాస్
కథ: టి. రాజసింహ
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
సంగీతం: సాయి కార్తీక్
నిర్మాతలు: అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీశ్, శ్రీనివాస్ ఇందూరి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం:  జి. నాగేశ్వరరెడ్డి
విడుదల తేదీ: 15 నవంబర్ 2019

'సీమ శాస్త్రి', 'సీమ టపాకాయ్', 'దేనికైనా రెడీ', 'ఈడో రకం ఆడో రకం'తో వినోదాత్మక సినిమాలను చక్కగా తెరకెక్కిస్తారని దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి పేరు తెచ్చుకున్నారు. అయితే లాస్ట్ డైరెక్ట్ చేసిన సినిమాలు మూడు సరిగా ఆడలేదు. మరి, సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కించిన 'తెనాలి రామకృష్ణ'లో ఆడే లక్షణాలు ఉన్నాయా? 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' తర్వాత కామెడీ ఎంటర్ టైనర్ తో సూపర్ సక్సెస్ అందుకొని సందీప్ కిషన్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అందుకుంటారా? రివ్యూ చదివి తెలుసుకోండి.

కథ:
తెనాలి రామకృష్ణ (సందీప్ కిషన్) ఒక చోటా మోటా లాయర్. చిల్లర కేసులు కూడా అతడి దగ్గరకు వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్లిపోతుంటాయి. ఓ సందర్భంలో తోటి లాయర్ ను కాపాడడం కోసం కోర్టు బయట ఓ కేసును కాంప్రమైజ్ చేస్తాడు. తర్వాత నుండి అలా కేసులను కాంప్రమైజ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తాడు. ఒకప్పుడు కోర్టులో అబద్దపు సాక్ష్యాలు చెప్పే తెనాలి రామకృష్ణ తండ్రి దుర్గారావు (రఘు బాబు) కొడుకు ఓ గొప్ప కేసు వాదించి గౌరవం తెచ్చుకుంటే చూడాలని కోరుకుంటాడు. తన తండ్రిని ప్రేమించిన అమ్మాయి రుక్మిణి (హన్సిక) తండ్రి (లాయర్ మురళీ శర్మ) అవమానించాడని కోపంతో అతడి దగ్గరకు వెళ్లిన తెనాలికి ప్రముఖ పారిశ్రామికవేత్త వరలక్ష్మీ దేవి (వరలక్ష్మీ శరత్ కుమార్)ను హత్యకేసులో ఇరికించారని తెలుసుకుంటాడు. ఆమె కేసు టేకప్ చేసి గెలుస్తాడు కూడా! కోర్టులో ఆమెను గెలిపించిన తెనాలి, మళ్ళీ ఆమెపై హైకోర్టులో అదే కేసును ఎందుకు రీఓపెన్ చేశాడు? అసలు, ఏమైంది? కథేంటి? అనేది మిగతా సినిమా.

విశ్లేషణ:
'దూద్ పేడాకు, ఆవు పేడకు తేడా తెలియని జనాలు ఉన్నారు' - ఇదీ తెనాలి రామకృష్ణగా తెరపైకి వచ్చిన కొన్ని క్షణాలకు సందీప్ కిషన్ చెప్పే డైలాగ్. పేడా, పేడ, తేడా... అని ప్రాస కుదిరిందని డైలాగ్ రాయడం తప్ప, అందులో అర్థం ఏమైనా ఉందా? పాలకోవాను ఎవరైనా పేడగా చూస్తారా? ఇంకో సందర్భంలో ప్రభాస్ శీను 'తలకాయ్ పగిలితే రక్తం కారక రకుల్ ప్రీత్ సింగ్ వస్తుందా?' అని డైలాగ్ చెప్తారు. కాఫీ అడిగితే టీ ఇచ్చిన భార్యతో 'బిస్కెట్స్ అడిగితే కుక్క బిస్కెట్స్ ఇచ్చేలా ఉన్నావ్' అని మురళీ శర్మ డైలాగ్. ఇటువంటి డైలాగులకు రెండు గంటలు నవ్వగలమని భరోసా ఉన్నవారు ఎటువంటి భయాలు లేకుండా 'తెనాలి రామకృష్ణ' సినిమాకు వెళ్ళవచ్చు. మిగతావాళ్ళు ఇటువంటి కేటగిరీ సినిమాలు నచ్చుతాయో, లేదో ఆలోచించుకోవాలి.

గతంలో కొన్ని కామెడీ సినిమాలతో జి. నాగేశ్వరరెడ్డి ప్రేక్షకులను నవ్వించారు. 'జబర్దస్త్' వంటి కామెడీ షోలు వచ్చాక, ఆయన హవా తగ్గింది. మళ్ళీ పూర్వవైభవం కోసం ఈ సినిమా తీశారు. సరైన కథ, సీన్స్, క్యారెక్టర్స్, డైలాగ్స్ కుదరకపోవడంతో ఫుల్ ఫామ్ లోకి రాలేదు. ఆయన సృష్టించిన పాత్రల్లో కేఏ పాల్ ను ఇమిటేట్ చేస్తూ, మాటలను పాట రూపంలో చెప్పే సత్యకృష్ణన్ క్యారెక్టర్ ఒక్కటీ క్లిక్ అయింది. స్పూఫ్ కామెడీని ఇష్టపడని వారిని సైతం ఎంతోకొంత నవ్విస్తుంది. కోర్టులో సత్యకృష్ణన్, పోసాని కృష్ణమురళి డైలాగ్స్ బావున్నాయి. సప్తగిరి తనదైన శైలిలో నవ్వించాడు. వెన్నెల కిషోర్ పర్వాలేదు. కామెడీ సినిమా కాబట్టి కథలో లాజిక్కులను పట్టించుకోకుండా వదిలేయడం మంచిది. పాటలు, నేపథ్య సంగీతం... రెండూ సినిమాకు అండగా నిలబడలేదు. సినిమాటోగ్రఫీ ఒకే. నిర్మాణ విలువలు చిన్న సినిమాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:
వరలక్ష్మీ శరత్ కుమార్
సత్యకృష్ణన్, సప్తగిరి, పోసాని కామెడీ

మైనస్ పాయింట్స్:
కథ, దర్శకత్వం
పాటలు, సంగీతం
హన్సిక
సందీప్ కిషన్ రొటీన్ యాక్టింగ్

నటీనటుల అభినయం:
నటుడిగా సందీప్ కిషన్ కొత్తగా చేసింది ఏమీ లేదు. లవ్, కామెడీ, ఫైట్స్, ఎమోషన్... ఏ సన్నివేశంలో హీరోని చూసినా ఇంతకు ముందు సినిమాల్లో చేసినట్టు చేశాడు. హన్సిక గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 'కేసు మీద కేసు, కేసు మీద కేసు వాదించి పెద్ద లాయర్ అయిపోతా' అని సినిమాలో ఒకటికి రెండుమూడు సార్లు చెప్పే డైలాగ్ కి లిప్ సింక్ ఇవ్వడంలో ఫెయిల్ అయింది. నటిగా కొంచెం కూడా సీరియస్ నెస్ లేకుండా చేసింది. హన్సికలో మునుపటి అందం కూడా మాయమైంది. వరలక్ష్మీ శరత్ కుమార్ చక్కటి హావభావాలతో పాత్రకు ఒక హుందాతనాన్ని తీసుకొచ్చింది. ఆగ్రహాన్ని కూడా అందంగా పలికించింది. తెలుగు ఉచ్ఛారణలో కొన్ని తప్పులు చెప్పినప్పటికీ, ఓన్ డబ్బింగ్ పాత్రకు పర్ఫెక్ట్ గా సూట్ అయింది. సత్యకృష్ణన్, పోసాని, సప్తగిరి, వెన్నెల కిషోర్ తెరపై కనిపించిన సమయంలో నవ్వించే ప్రయత్నం చేశారు. ప్రభాస్ శీను పాత్రను న్యాయం చేశారు. మురళీ శర్మ, అయ్యప్ప శర్మవి రొటీన్ పాత్రలే.    

తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:
సినిమాలో కొన్ని నవ్వులు ఉన్నాయి. అలాగని, ప్రచార చిత్రాలు చూసి సినిమా అంతా నవ్వుకోవచ్చని థియేటర్లకు వెళితే కొన్ని తిప్పలు తప్పవు. పాటలు బాగోలేదు. హీరోయిన్ కూడా బాగోలేదు. హీరో రొటీన్ గా చేశాడు. ఇటువంటి కొన్ని తప్పులను క్షమిస్తే.... కాసేపు నవ్వుకోవచ్చు. లేదంటే ఫోనులో పాత సినిమాల్లో కామెడీ సీన్స్ చూసుకోవచ్చు.

రేటింగ్: 2/5


Cinema GalleriesLatest News


Video-Gossips