స్టైల్లో తగ్గనంటున్న బాలయ్య!
on Sep 1, 2019
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 105వ సినిమా తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. తమిళ సీనియర్ డైరెక్టర్ కె.ఎస్. రవికుమార్ రూపొందిస్తోన్న ఈ మూవీలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. తొలి షెడ్యూల్‌ను థాయిలాండ్‌లో నిర్వహించారు. ఈ షెడ్యూల్లో బాలయ్య, సోనాల్ చౌహాన్‌పై ఒక పాటను కూడా చిత్రీకరించినట్లు నిర్మాతలు మీడియాకు రిలీజ్ చేసిన పోస్టర్ స్టిల్ చెబుతోంది. కళ్లకు గాగుల్స్, వాన్ డైక్ బియర్డ్ లుక్‌లో బాలయ్య, కురచ దుస్తుల్లో సోనాల్ డ్యూయెట్ పాడుకుంటున్నట్లు కనిపిస్తోంది. దాంతో పాటు హెలికాప్టర్లో బ్లూ సూట్‌తో దిగుతోన్న బాలయ్య పోస్టర్ స్టిల్‌ను కూడా విడుదల చేశారు. వినాయక చవితిని పురస్కరించుకొని వీటిని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్స్‌లో స్టైల్ విషయంలో కుర్ర హీరోలతో తానే మాత్రం తీసిపోనని బాలయ్య చెబుతున్నట్లుంది. ఈ లుక్ కాకుండా మూవీలో మరో లుక్‌లోనూ బాలయ్య కనిపిస్తాడని చిత్ర బృందం అంటోంది.
రెండో షెడ్యూల్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో సెప్టెంబర్ 5 నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది మేజర్ షెడ్యూల్. భూమికా చావ్లా, జయసుధ, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు చేస్తొన్న ఈ సినిమాకు చిరంతన్ భట్ సంగీతం సమకూరుస్తున్నాడు. 'గౌతమిపుత్ర శాతకర్ణి', 'జై సింహా' తర్వాత ఆయన మూడోసారి బాలయ్య సినిమాకి పనిచేస్తున్నాడు. ఇక 'జై సింహా' తర్వాత బాలయ్య, కె.ఎస్. రవికుమార్, నిర్మాత సి. కల్యాణ్ కాంబినేషన్లో తయారవుతున్న సినిమా ఇది. డిసెంబర్లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Also Read