ENGLISH | TELUGU  

దేవుడు కరుణించడానికి రెడీ.. పూజారే రెడీగా లేడు!

on Oct 30, 2017

మన తెలుగు హీరోలు ప్రయోగాలకు ఆమడ దూరం... అని నోరున్న ప్రతోడూ విమర్శిస్తుంటాడు.  
నిజం చెప్పండీ... పాపం... ప్రయోగానికని ప్రయత్నం చేస్తే.. చేతులు కాలడం తప్ప... ఏనాడైనా మంచి జరిగిందా?.. 
ఒక్కటి కాకపోతే.. ఒక్క సినిమా అయినా.. హిట్ అయ్యిందా?. 
సినిమా అంటేనే వ్యాపారంతో కూడుకున్నది. ఒక్క సినిమా ఫ్లాప్ అయితే... నష్టం కోట్లలో ఉంటుంది. సొమ్మొకడిది-సోకొకడిది అన్నట్టు...
మరి ఎవరి డబ్బుతో ఎవరు ప్రయోగాలు చేయాలి..? ఎవరి ఆనందం కోసం ఎవరు పాడవ్వాలి? చెప్పండి?

 

బాలీవుడ్ లో ఆమిర్ ఖాన్ పెద్ద సూపర్ స్టార్. ఆయన హంగులు, హడావిడీ లేకుండా... ఇమేజ్ ని పక్కనపెట్టి ‘దంగల్’ చేశారు.  ఆయన చేశాడని జనాలు ‘దంగల్’ని చూడలేదు. అద్భుతంగా ఉంది కాబట్టి చూశారు. బాగుండకపోతే... విస్సి..రి కొట్టేవారు. సో... ఇక్కడ మనం అభినందించాల్సింది... ‘దంగల్’దర్శకుడు నితీష్ తివారీని. చేసింది ప్రయోగమే అయినా... జనాలు ప్రమోదంగా భావించారు. అందుకే రెండువేల కోట్లు వసూలు చేసింది. అటు ఆత్మ సంతృప్తి... ఇటు ఆర్థిక సంతృప్తి. ఇందుమూలంగా చెప్పొచ్చేదేంటంటే... ప్రయోగాలు చేయాలంటే... హీరోలు ముందుకొస్తే సరిపోదు. దర్శకుడు కూడా సరైన వాడు అయ్యుండాలి. లేకపోతే... డబ్బుపెట్టేవాళ్లు దుమ్ముకొట్టుకుపోతారు. 

 

మన హీరోలు కూడా పాపం... అప్పుడప్పుడు ప్రయోగాలు చేశారు. ఎవరి సంగతో దేనికి... మన మహేశ్ బాబునే తీసుకోండీ.. ‘టక్కరి దొంగ’అని ఓ సినిమా చేశాడు. నిజంగా అది ప్రయోగమే. కౌబాయ్ సినిమా. మహేశ్ కూడా చెలరేగిపోయి నటించాడు. కానీ ఏమైందీ... రెండోరోజే బాక్సులు వెనక్కొచ్చాయ్. జయంత్ సి.పరాన్జీకి లాభం గూబలోకి కొచ్చింది. 

 

అప్పటికీ కళ్లు తెరవలేదు మనోడు... శోభన్ దర్శకత్వంలో ‘బాబీ’ అని ఇంకో ప్రయోగం చేశాడు. అసలే మాస్ హీరో.. చివరకు బేలగా ప్రాణాలు వదిలేస్తే జనాలు చూస్తారా? చెప్పండి? సినిమా డిజాస్టర్. పాపం ఆ నిర్మాత ఎవరో కానీ...సోదిలో లేకుండా పోయాడు. 

 

ముచ్చటగా మూడోసారి మహేశ్ చేసిన మరో ప్రయోగం... ‘నిజం’. అట్టర్ ఫ్లాప్. స్వీయదర్శకత్వంలో సినిమాను నిర్మించిన తేజాకు తేరుకోడానికి 14 ఏళ్లు పట్టింది. 

 

ఇంత జరిగాక.. ఎవరైనా జాగ్రత్త పడతారు. సేఫ్ గేమ్ ఆడటం మొదలుపెడతారు. కానీ మహేశ్ అలా కాదు.. మరో ప్రయోగానికి తెగబడ్డాడు. ఈ దఫా భారీ ప్రయోగం. దర్శకుడు ఎస్.జె.సూర్య. సినిమా పేరు ‘నాని’. సైంటిఫిక్ థ్రిల్లర్. మహేశ్ పెర్ ఫార్మెన్స్ పీక్స్ లో ఉంటుంది.  మహేశ్ అక్కయ్య.. మంజుల నిర్మాత. పాపం... పెట్టిన సొమ్మంతా గొడక్కొట్టిన సున్నమే అయ్యింది... సర్వమంగళం.  

 

అప్పుడు కానీ... సూపర్ స్టార్ కి జ్ఙానోదయం కాలేదు. జనం మెచ్చేది మనం చేయాలి కానీ... మనం మెచ్చేది జనం చూడరనే సత్యాన్ని గ్రహించాడు. హిట్లు మొదలయ్యాయ్. సరే... లైన్లో విజయాలు వస్తున్నాయ్ కదా.. అనుకొని ఇంకోసారి ‘నేనొక్కడినే’ అంటూ ప్రయోగం.. అనే తేనెపట్టుని కదిపాడు. ఇంకేముంది ముగ్గురు నిర్మాతలకూ తిరుక్షవరం. రీసెంట్ గా వచ్చిన ‘స్పైడర్’ కూడా ప్రయోగమే. 

 

నిజానికి మురుగదాస్ మంచి దర్శకుడు. ఘన విజయాలెన్నో అందుకున్నాడు. మరి మహేశ్ లాంటి సూపర్ స్టార్ దొరికితే... సినిమాను ఎలా తీయాలి? కానీ మనోడు అలా తీయలేదనేది చాలామంది వాదన. తడబడ్డట్టు చెప్పుకుంటున్నారు. దీన్నిబట్టి అర్థమైందేంటి? ప్రయోగాలు చేయడానికి హీరోలు ముందుకొచ్చినా.. జనామోదంగా చూపించే దర్శకులు మనకు లేరు. ఇక్కడ దేవుడు కరుణించడానికి రెడీగా ఉన్నాడు. కానీ.. పూజారే రెడీగా లేడు. 

ప్రయోగం అంటే ప్రమాదం అంటున్న నేటి రోజుల్లో... ప్రయోగమే అయినా.. ప్రమోదమే అనేట్టు సినిమాలు తీసే దర్శకులు మనకు దొరికినప్పుడు... అప్పుడు తెలుగు సినిమాకు ఓ కొత్త శోభ మొదలవుతుంది. కె.బాలచందర్, కె.విశ్వనాథ్, పుట్టన్న కనగళ్, బాపూ, భారతీరాజా, మణిరత్నం, ప్రియదర్శిన్, ఫాజిల్, రామ్ గోపాల్ వర్మ... వీరందరూ ఆ విధంగా దక్షిణాది సినిమాకు కొత్త శోభను తెచ్చిన వారే. భారీ భారీ సెట్లతో గ్రాఫిక్స్ మాయాజాలంతో.. కోటానుకోట్లను ఖర్చుపెట్టి వీళ్లు సినిమాలు చేయలేదు. నేల మీద నడిచే సినిమాలు తీశారు. ప్రయోగాలంటే అవే. కథలు కొత్తగా ఉంటాయ్. పాత్రలు కొత్తగా ఉంటాయ్. కొత్తగా ప్రవర్తిస్తాయ్. కొత్త అనుభూతిని పంచుతాయ్.. అవి ఎప్పటికీ చెక్కుచెదరవ్. అలాంటి సినిమాలు తీసే దర్శకులు మళ్లీ ఎప్పుడొస్తారో?


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.