స్పైడర్ కి మళ్లీ రిపేర్లు మొదలయ్యాయి
on May 13, 2017
మహేష్ బాబు - మురుగదాస్ కాంబినేషన్ అంటే అంచనాలు మామూలుగా ఉండవు. ఒకరు సూపర్ స్టార్. మరొకరు.. సూపర్ డైరెక్టర్. అందుకే స్పైడర్‌పై భారీ ఆశలు, అంచనాలూ పెరిగిపోయాయి. దాన్ని అందుకోవడానికి చిత్రబృందం కూడా తెగ కష్టపడుతోంది. అంచనాలకు తగ్గట్టు రావడానికి రీ షూట్లకు కూడా సిద్దపడుతోంది. `మా సినిమాకి రీషూట్లేం జరగడం లేదు` అని చిత్రబృందం గట్టిగా చెబుతున్నా - తెర వెనుక జరుగుతోంది అదే. లేదంటే ఏప్రిల్‌కి రావల్సిన సినిమా ఆగస్టులో విడుదల కావడం ఏమిటి?? ఇప్పుడు ఆగస్టులోనూ ఈ చిత్రం రావడం డౌటే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. ఎందుకంటే ఇప్పుడు మళ్లీ ఈ సినిమాకి రిపేర్లు చేయడం మొదలెట్టార్ట. స్పైడర్‌లో సీజీ కి కొంత ప్రాధాన్యం ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ ని పైపైనే చేసేద్దాం.. అనుకొంది చిత్రబృందం.
కానీ బాహుబలి 2 తరవాత విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యం గుర్తించడం మొదలెట్టింది చిత్రసీమ. ఎక్కడ ఏ చిన్న అవకాశం ఉన్నా సరే. విజువల్‌గా సినిమాని గ్రాండ్‌గా చూపించాల్సిందే. అందుకే వీఎఫ్ ఎక్స్‌కి సంబంధించిన సన్నివేశాలన్నీ మళ్లీ రీషూట్ చేసి, వాటికి మకుట సంస్థకు ఇవ్వాలని నిర్ణయించుకొన్నారు. మహేష్ ఆఫీస్ సెటప్ అంతా.. వీఎఫ్ఎక్స్లో తీసిందే. అంటే.. ఆయా సీన్లు మళ్లీ రీషూట్ చేయాలన్నమాట. ఇప్పటికే రీషూట్లతో సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఇప్పుడు మరోసారి రీషూట్ అంటే... స్పైడర్.. ఇప్పట్లో విడుదల కావడం కష్టమే.