దిల్ రాజు వ్యూహం అదుర్స్
on Feb 7, 2017
ఒకప్పుడు నిర్మాతకి ఉన్న గౌరవం వేరు. పోను పోను నిర్మాత అనేవాడు కేవలం పెట్టుబడి పెట్టే వ్యక్తిగా తప్ప, తన అస్తిత్వం సాంతం కోల్పోయాడు. అయితే, ఇప్పటికే పాతిక పైగా సినిమాలు నిర్మించిన దిల్ రాజు అంటే ఇండస్ట్రీ లో అందరికి ఒకింత గౌరవం మరియు అతనితో పనిచేయడానికి అగ్ర హీరోలు సైతం ఉత్సాహం చూపిస్తారు.
చిరంజీవి లాంటి వాడు తన 150 వ సినిమాతో పోటీకి వచ్చినా శతమానం భవతి విజయోత్సవ సభకి వచ్చాడంటే, అది కేవలం ఆయనకు దిల్ రాజు పైన ఉన్న ఇష్టం మాత్రమే. ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, ఒకప్పటి అగ్ర దర్శకుడైన రాఘవేంద్ర రావు గారు దిల్ రాజు ని 'నిర్మాత ఉనికిని కాపాడుతున్నావయ్యా' అంటూ కొనియాడాడు. అంతలా ఎదిగాడు రాజు.
అయితే, ఈ గుర్తింపు ఒక రోజులోనో, ఒక సంవత్సరం లోనే తెచ్చుకుంది కాదు. ఈ రోజు ఆయన స్థాయి వెనుక కొన్ని ఏళ్ళ కఠోర శ్రమ ఉంది. దానికి తోడు, ఎప్పటికప్పుడు, తన వ్యూహాలు మారుస్తూ, సక్సెస్ కి కేరాఫ్ అడ్రస్ అయ్యాడు.
శతమానం భవతి సంక్రాంతికి పెద్ద సినిమాలకి పోటీగా విడుదల చేయడమే గొప్ప విషయం అయితే, విడుదలకి ముందు ప్రమోషన్స్ అస్సలు చేయలేదు. ఏంటబ్బా ఈయన వ్యవహారం అని అనుకునే వాళ్ళకి, ఆ సినిమా మంచి టాక్ తెచ్చుకోవడం, తర్వాత దిల్ రాజు ప్రమోషన్స్ మొదలు పెట్టడం, ఇవన్నీ సినిమాని విజయ పథం వరకు తీసుకెళ్లడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇదే వ్యూహాన్ని, తన నేను లోకల్ సినిమాకి అమలు చేస్తున్నారు రాజు గారు. అసలు విడుదలకి ముందు మొత్తానికి పట్టించుకోవడం మానేసి, సినిమా సూపర్ హిట్ టాక్ రావడంతో ఇక ప్రచారం జోరు పెంచారు. ఇప్పటికే, మొదటి మూడు రోజులకి ప్రపంచ వ్యాప్తంగా 15 కోట్లు కొల్లగొట్టిన నేను లోకల్, నాని కెరీర్లో అతి పెద్ద హిట్ ఔతుందంటున్నారు సినిమా పండితులు. ఏది ఏమైనా వ్యూహాలు పన్నడంలో, దిల్ రాజు గొప్పోడబ్బా!