మహేష్... గిఫ్టులేం లేవా??
on Aug 9, 2016
తమ అభిమాన హీరో పుట్టిన రోజు వస్తోందంటే.. అభిమానుల సందడి రెట్టింపు అవుతోంది. తమ హీరోకి సంబంధించిన టీజరో, పోస్టరో బయటకు వస్తుందని ఎదురుచూస్తుంటారు. ఆ సంబరాల్ని ఘనం గా చేసుకొందామని ఆశ పడతారు. మహేష్ బాబు పుట్టిన రోజుకీ ఇన్నే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మహేష్ - మురుగదాస్ కాంబినేషన్లో ఓ సినిమా ఇటీవలే మొదలైంది. ఈరోజు (మంగళవారం) మహేష్ బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా మహేష్ బాబు సినిమాకి సంబంధించిన టీజరో, ఫస్ట్ లుక్కో వస్తుందనుకొన్నారు. కనీసం టైటిల్ అయినా చెబుతారని ఆశ పడ్డారు. కానీ అవేం జరగలేదు. మహేష్ పుట్టిన రోజు వేడుక సాదాసీదాగా జరిగిపోతోంది. కనీసం మహేష్ ఫొటో కూడా రిలీజ్ చేయలేదు. దాంతో మహేష్ ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురవుతున్నారు. షూటింగ్ ఇటీవలే మొదలవ్వడం వల్ల మహేష్‌కి సంబంధించిన ఫుటేజ్ ఇంకా రెడీ కానందున టీజర్ విడుదల చేయలేదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. హడావుడిగా ఏదో ఓ లుక్కు విడుదల చేయడం కంటే, కామ్‌గా ఉండడమే బెటరని చిత్రబృందం భావించిందట. టైటిల్‌పై ఇంకా క్లారిటీ లేకపోవడం వల్ల దాని ప్రస్తావన కూడా తీసుకురాలేదు. అందుకే మహేష్ పుట్టిన రోజు ఇంత చప్పగా సాగిపోతోంది.