ENGLISH | TELUGU  

శ్రీ‌మంతుడు రివ్యూ

on Aug 7, 2015

తెలుగు సినిమా క‌మ‌ర్షియ‌ల్ ఫార్మెట్ ని వ‌ద‌లుకోవ‌డానికి ఎప్పుడూ ఇష్ట‌ప‌డ‌దు. అవే పాటలు, అవే ఫైట్స్.. వాళ్లు మార‌రు. మ‌న‌ల్ని మార‌నివ్వ‌రు. అయితే అందులోనే ఓ కొత్త పాయింట్‌, అందులోనే కాస్త ఎమోష‌న‌ల్ ఫీలింగ్స్, అందులోనే చిన్న‌పాటి సందేశం ఇస్తే ఎంత బాగుంటుంది..?? ఆ ప్ర‌య‌త్నం చేసిన సినిమా `శ్రీ‌మంతుడు`. మహేష్ బాబులాంటి ఓ స్టార్ హీరో, పెద్ద కాన్వాన్‌, పెద్ద బ‌డ్జెట్ సినిమా - అయినా స‌రే రెగ్యుల‌ర్ ఫార్మెట్‌లోల‌కి వెళ్ల‌కుండా, రెగ్యుల‌ర్‌గా ఉండే క‌మ‌ర్షియాలిటీ మిక్స్ చేస్తూ తెలివిగా చేసిన ప్ర‌య‌త్నం - శ్రీ‌మంతుడు. మ‌రి ఆ ప్ర‌య‌త్నం ఎంత వ‌ర‌కూ విజ‌య‌వంత‌మైంది? ఈ ఫార్ములా ఎంత వ‌ర‌కూ వ‌ర్క‌వుట్ అవుతుంది..? తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

25 వేల కోట్ల అధిప‌తి (జ‌గ‌ప‌తిబాబు) ఏకైక కుమారుడు హ‌ర్ష (మ‌హేష్ బాబు). అంత ఆస్తి ఉన్నా సింపుల్‌గా బ‌త‌క‌డం అంటేనే త‌న‌కిష్టం. హ‌ర్ష ఏంట‌న్న‌ది ఇంట్లోవాళ్ల‌కు ఎవ్వ‌రికీ అర్థంకాదు. బిజినెస్ చూసుకోమ‌ని పోరుపెడుతున్నా... త‌న‌కు కావ‌ల్సింది మ‌రేదో ఉంద‌ని అన్వేషిస్తుంటాడు. ఆ ప్ర‌యాణంలో చారుల‌త (శ్రుతిహాస‌న్‌) ప‌రిచ‌యం అవుతుంది. రూల‌ర్ డ‌వ‌లెప్ మెంట్ లో కోర్సు చేస్తుంటుంది. చారు కోసం ఆ కోర్సులో జాయిన్ అవుతాడు హ‌ర్ష‌. తానెవ‌రో చెప్ప‌కుండా మామూలుగానే మసులుకొంటాడు. చారు కూడా హ‌ర్ష‌ని ఇష్ట‌ప‌డుతుంది. అయితే ఓ సంద‌ర్భంలో హ‌ర్ష వేల కోట్ల‌కు వార‌సుడ‌ని తెలుస్తుంది. దాంతో చారు... హ‌ర్ష‌ని దూరం పెడుతుంది. `నీ పుట్టిన ఊరు నీకు తెలుసా?  ఆ ఊరు కోసం నీ తండ్రి ఏం చేయ‌లేదు. నువ్వూ ఏం చేయ‌లేదు` అంటూ క్లాసు పీకుతుంది. అప్పుడే అర్థ‌మ‌వుతుంది త‌న ఊరు.. దేవ‌ర‌క‌ట్ట అని. ఆ గ్రామం శ‌శి (సంప‌త్‌) చేతిలో ఉంటుంది. ఆ ఊరిని ఎద‌గ‌నివ్వ‌డు శ‌శి. త‌న అక్ర‌మాల‌కు మాత్రం ఆ ఊరిని అడ్డాగా మార్చుకొంటాడు. ఎదురు తిరిగిన‌వాళ్ల‌ని చంపేస్తుంటాడు. ఆ ఊర్లో బ‌త‌క‌లేక‌, చావ‌లేక అక్క‌డి నుంచి వాళ్లంతా వ‌ల‌సిపోతుంటారు. ఆ ఊరికి హ‌ర్ష వెళ్తాడు. ఆ గ్రామాన్ని ద‌త్త‌త తీసుకొంటాడు. మ‌రి ఆ ఊరిని అభివృద్ది ప‌రిచాడా, శ‌శిని ఎలా ఎదుర్కొన్నాడు? అస‌లు చారుల‌త ఎవ‌రు?  దేవ‌ర‌క‌ట్ట‌కీ చారుల‌త‌కీ సంబంధం ఏమిటి?  ఈ విష‌యాల‌న్నీ శ్రీ‌మంతుడు చూసి తెలుసుకోవాల్సిందే.

పుట్టి పెరిగిన ఊరుని మ‌ర్చిపోతే, మ‌న మూలాల్ని మ‌ర్చిపోయిన‌ట్టే. ఎద‌గ‌డం అంటే మ‌నం మాత్ర‌మే కాదు, మ‌న ఊరువాళ్లూ బాగుప‌డిన‌ప్పుడే ఎదిగిన‌ట్టు.. అనే పాయింట్ చుట్టూ అల్లుకొన్న క‌థ ఇది. ఇలాంటి పాయింట్‌ని ఓ స్టార్ హీరోతో డీల్ చేయాల‌నుకోవ‌డం, అందుకు మ‌హేష్ ఒప్పుకోవ‌డం నిజంగా అభినంద‌నీయం. ఆ ప్ర‌య‌త్నాన్ని మెచ్చుకోవాలి. కేవ‌లం సందేశాల‌కు ప‌రిమితం చేయ‌కుండా పాట‌లు, ఫైట్స్‌, ఎమోష‌న్ సీన్స్‌.. ఇలా అన్నీ ఈ క‌థ‌లోనే భాగం అయ్యేట్టు చూసుకొన్నారు. సినిమా ఫ్లాట్‌గా మొద‌ల‌వుతుంది. హ‌ర్ష ఎవ‌రు?  ఏం చేస్తుంటాడు? త‌న ఆలోచ‌న‌లు ఎలా ఉంటాయి?  అనేవాటిపై ఫోక‌స్ చేస్తూనే ఫ‌స్టాఫ్ సాగుతుంది. చారుల‌త‌తో ప‌రిచ‌యం. ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌డం.... విశ్రాంతి వ‌ర‌కూ ఈ స‌న్నివేశాల‌తోనే న‌డిపారు. అంతే త‌ప్ప‌.. `పాయింట్‌`లోకి వెళ్ల‌లేదు. సినిమాలోని మొద‌టి సీన్‌కీ.. ఇంట్ర‌వెల్ సీన్ కీ పోగ్రెస్ ఏమైనా ఉందంటే.. అది హ‌ర్ష - తాను పుట్టిన ఊరుని వెదుక్కొంటూ వెళ్ల‌డ‌మే. అస‌లు క‌థ‌లోకి ఎంట‌ర్ అవ్వ‌కుండా సినిమాని ఇంట్రవెల్ వ‌ర‌కూ న‌డిపించిన ద‌ర్శ‌కుడ్నీ, అస‌లు ఆ పాయింటే మ‌ర్చిపోయి ద‌ర్శ‌కుడు చెప్పింద‌ల్లా చేసుకెళ్లిపోయిన హీరోల‌కు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఇంట్ర‌వెల్ లో బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆడియ‌న్ `అస‌లు ఇప్ప‌టి వ‌ర‌కూ ఏం జ‌రిగింది?` అంటూ ఓసారి రివైండ్ చేసుకొంటే మ‌హేష్ త‌ప్ప ఇంకేం క‌నిపించ‌దు. కేవ‌లం మ‌హేష్‌ని చూపించే గంట‌న్న‌ర సినిమా న‌డిపేశార‌న్న సంగ‌తి అర్థ‌మ‌వుతుంది.

ఆ త‌ర‌వాత ఊర్లో అడుగుపెట్టిన శ్రీ‌మంతుడు అక్క‌డేం చేశాడ‌న్న‌ది సెకండాఫ్‌ సినిమా మొత్త‌మ్మీద హైలెట్ - శ్రీ‌మంతుడిగా మ‌హేష్ క్యారెక్ట‌రైజేష‌న్‌. అది త‌ప్ప ఈ సినిమాలో ఇంకేంముంది? అని ఆలోచిస్తే అంత‌గా స‌మాధానం దొర‌క్క‌పోవ‌చ్చు. హ‌ర్ష పాత్ర చుట్టూనే క‌థ న‌డిపాడు ద‌ర్శ‌కుడు. త‌న మంచిత‌నాల‌తో ఈ సినిమాని ముంచేశాడు. చివ‌ర్లో తండ్రీ కొడుకుల బంధం, ఫ్యామిలీ ఎమోష‌న్స్ వైపు కాస్త మ‌గ్గాడు గానీ లేదంటే సినిమా మొత్తం మ‌హేష్ క్యారెక్ట‌రైజేష‌న్ త‌ప్ప ఇంకేం ఉండేది కాదు. ఫ‌స్టాఫ్ త‌ర‌వాత సెకండాఫ్ లో ఏం జ‌రుగుతుంది?  అనే విష‌యం ఇట్టే తెలిసిపోతుంది. మ‌న బుర్ర‌కు ప‌దును పెట్టే సీన్లు, భ‌యంక‌ర‌మైన ట్విస్ట్ లూ ఈ సినిమాలో ఒక్క‌టీ లేవు. ఊర్లో అరాచ‌కాలు, అక్క‌డి అన్యాయాల‌కు హీరో ఎలా ఎదురుతిరిగాడ‌న్న‌ది ప‌ర‌మ మూస ప‌ద్ధ‌తిలో, కాస్త క్లాసీగా చూపించాడు ద‌ర్శ‌కుడు. హీరోల మంచిత‌నం, సొంతూరికి ఏదో చేయాల‌న్న త‌ప‌న మిగిలిన సినిమాల్లో ఒక‌ట్రెండు మాంటేజ్ షాటుల్లో చూపిస్తారు. ఈ సినిమా అంతా అదే. దాంతో సినిమా కాస్త బోర్‌గా అనిపిస్తుంది. న‌త్త‌న‌డ‌క‌గా సాగిన స్ర్కీన్ ప్లే... భారంగా తోస్తుంది. ఓ ద‌శ‌లో క్లైమాక్స్ వ‌చ్చేస్తే బాగుణ్ణు అని కూడా అనిపిస్తుంది. అయితే... ఏదో ఓ మంచి విష‌యం చెప్పాల‌ని త‌ప‌న ప‌డుతున్నాడులే అనిపించి వాట‌న్నింటినీ ఓపిగ్గా భ‌రిస్తామంతే.

ఈ సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ మ‌హేష్ బాబు. త‌ను ఎంత అంద‌గాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లెద్దు. ఈ సినిమాలోనూ అంతే అందంగా, ఆ మాట‌కొస్తే అంత‌కంటే అందంగా క‌నిపించాడు. ఇలాంటి క‌థ‌ని ఓకే చేయ‌డంలో మ‌హేష్ గ‌ట్స్‌ని మెచ్చుకోవాలి. హ‌ర్ష పాత్ర‌లో సింపుల్‌గా జీవించేశాడు. ఎమోష‌న్ సీన్స్‌లో కంట‌త‌డి పెట్టించాడు. త‌న ఫ్యాన్స్ కోసం డాన్సుల విష‌యంలో కాస్త క‌ష్ట‌ప‌డి స్టెప్పులు వేశాడు. త‌న వ‌ర‌కూ ఏలోటూ చేయ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డాడు. క‌థానాయిక శ్రుతిదీ ప్రాముఖ్యం ఉన్న పాత్రే. తానూ బాగా చేసింది. అయితే సీన్ల‌లో ఎంత ప‌ద్ధ‌తిగా క‌నిపించిందో.... మాసీ పాట‌ల్లో అంత సెక్సీగా త‌యారైపోయింది. జ‌గ‌ప‌తిబాబు ప‌ర్‌ఫెక్ట్‌గా సూటైపోయాడు. నారాయ‌ణ‌రావు పాత్ర‌లో... రాజేంద్ర ప్ర‌సాద్ న‌ట‌న కూడా మెప్పిస్తుంది. మిర్చిలో అద‌ర‌గొట్టిన సంత‌ప్‌కి ఈ సినిమాలో అంత‌గా స్కోప్ లేదు.అలీది మ‌రీ ప్రాధాన్యం లేని పాత్ర‌. వెన్నెల కిషోర్ కాస్త న‌వ్వించాడంతే.

మ‌ది కెమెరా ఈసినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌. ప్ర‌తి ఫ్రేమూ బాగా చూపించాడు. దేవిశ్రీ పాట‌లు థియేట‌ర్లో హోరెత్తిస్తాయి. కొర‌టాల శివ ఎంచుకొన్న పాయింట్ మంచిదే. కానీ.. పూర్తిస్థాయి క‌మ‌ర్షియ‌ల్ సినిమాగా మ‌ల‌చ‌లేక‌పోయాడు. సినిమాలో డ్రాగ్ ఎక్కువుంది. ఇలాంటి క‌థ‌ల్లో ఉన్న ఇబ్బందే అది. కొర‌టాల డైలాగులు బాగుంటాయి. మిర్చిలో డైలాగులు బాగా పేలాయి. అయితే ఆ మెరుపులు ఈ సినిమాకొచ్చేస‌రికి కాస్త త‌గ్గాయి. ఊరి గురించి మ‌హేష్ చెప్పిన డైలాగులు కాస్త బెట‌ర్‌. ఈ సినిమా లెంగ్త్ ఇంకాస్త త‌గ్గించుకొంటే బెట‌ర్‌. సెకండాఫ్ ఇంకా ట్రిమ్ చేయాల‌నిపిస్తుంది.

మ‌హేష్ ఏదో త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేసి ఓ కొత్త పాయింట్‌ని ఎంచుకొన్నాడు. అయితే... ప‌ర్‌ఫెక్ట్ గా డీల్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడు విఫ‌ల‌మ‌య్యాడు. అక్క‌డ‌క్క‌డ ఎమోష‌న్ పండినా.. సినిమా మొత్తం అది క్యారీ అవ్వ‌లేదు. మ‌హేష్ అందం, న‌ట‌న‌, అత‌ని డైలాగులు, హ‌ర్ష అనే క్యారెక్ట‌రైజేష‌న్ ఇవే శ్రీ‌మంతుడుని కాపాడాలి.


పంచ్ లైన్ :  మిడిల్ క్లాస్ `శ్రీ‌మంతుడు`


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.