రవితేజ... ఒంగోలు పోలీస్
on Sep 30, 2019
'ఖాకీ చొక్కా వేసేస్తాను. లాఠీ పట్టుకు తిరిగేస్తాను. తేడా వస్తే కుమ్మేస్తాను. పోలీస్ నేనేరా' అని 'గోలీమార్'లో ఒక పాట. అందులో హీరో గోపీచంద్ కంటే రవితేజకు ఈ పాట పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందేమో. ప్రజెంట్ హీరోల్లో పోలీస్ క్యారెక్టర్లు, పోలీస్ నేపథ్యంలో కథలు ఎక్కువ చేసింది రవితేజ. మాస్ మహారాజలో పోలీస్ కథలపై మక్కువ పెంచేలా చేసింది 'ఇడియట్' అనుకుంట. బహుశా... పోలీస్ నేపథ్యంలో రవితేజ చేసిన మొదటి సినిమా అదే. అందులో పోలీస్ కాకున్నా... చివర్లో పోలీస్ అయినట్టు చూపించారు. తర్వాత 'వెంకీ', 'విక్రమార్కుడు', 'ఖతర్నాక్', 'కిక్', 'మిరపకాయ్', 'పవర్', 'టచ్ చేసి చూడు'... పోలీస్ నేపథ్య కథలతో చాలా సినిమాలే చేశాడు. ఇప్పుడు వీటి ప్రస్తావన ఎందుకంటే... సిల్వర్ స్క్రీన్ పై మరోసారి పోలీస్ క్యారెక్టర్ చేసేందుకు రవితేజ రెడీ అవుతున్నారు. 'డాన్ శీను','బలుపు' తర్వాత, తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అందులో హీరో పోలీస్. ఒంగోలు నేపథ్యంలో కథ సాగుతుందని తెలిసింది. ఈ సినిమాలో రవితేజకు జోడీగా శృతి హాసన్ నటించనున్నారని సమాచారం.