రజనీ మనసు దోచుకున్న పిల్లవాడి నిజాయితీ
on Jul 17, 2018
అతని పేరు యాసిన్. చదివేది రెండో తరగతి. అది కూడా ఈరోడ్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో. అయితే ఏం! బుద్ధున్న పెద్దవాళ్లు కూడా చేయలేని యాసిన్ చేసి చూపించాడు. తనకి దొరికిన ఓ పర్సుని క్షేమంగా పోలీసులు దగ్గర అప్పగించాడు. అందులో వెయ్యి, పదివేలు కాదు... ఏకంగా యాభైవేల రూపాయలు ఉన్నాయి. యాసిన్ గురించి విన్న తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తెగ మురిసిపోయాడు. ‘వీసమెత్తు డబ్బు కోసం హత్య చేయడానికి కూడా వెనకాడని ఇలాంటి కాలంలో... యాసిన్ చూపించిన నిజాయితీ చాలా అరుదు’ అంటూ ఆశ్చర్యపోయాడు. వెంటనే యాసిన్ కుటుంబాన్ని తన దగ్గరకు పిలిపించుకుని మనసారా అభినందించాడు. అంతేకాదు! పిల్లవాడు స్కూల్ చదువు పూర్తిచేసిన తర్వాత... తను ఏం చదువుకోవాలన్నా కూడా, అందుకు కావల్సిన డబ్బు తనే అందిస్తానని మాట ఇచ్చేశాడు. సూపర్‌స్టార్‌ని దగ్గరగా చూస్తేనే పొంగిపోయే యాసిన్‌కి, ఆయన ఏకంగా తన భవిష్యత్తుకి భరోసా ఇస్తున్నాడని తెలియగానే నోట మాట రాలేదు. నిజాయితీ లేకపోతే దొరికే డబ్బు సంగతేమో కానీ, నిజాయితీతో ఉంటే దక్కే బహుమతి మాత్రం చాలా విలువైందిగా ఉంటుందేమో!