`మా`లో మొదలైన విభేదాలు!!
on Mar 22, 2019
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష్ ప్రెసిడెంట్ గా నరేష్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసారు. అయితే ఈ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో `నేను అసోసియేషన్ కోసం బాగా కష్టపడతానని మాటిస్తున్నాను` అని తెలిపారు నరేష్. దీంతో నరేష్ మాట్లాడిన తీరుపై నటుడు , `మా` ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాజశేఖర్ వెంటనే కలగజేసుకుని అభ్యంతరం వ్యక్తం చేసారు. నరేష్ మాట్లాడిన మాటల్లో ఎక్కడా `మేము` అనే పదం వాడకుండా `నేను` అనే పదం వాడారని రాజశేఖర్ అసహనం వ్యక్తం చేశారు.
``నేను మాట్లాడటానికి చాలా ఉంది`. మీకు ఓపిక ఉంటే వినవచ్చు. నరేష్, నేను నేను అన్న మాట వాడకూడదు. `మేము` అని మాట్లాడాలి. అసలు ఈ కార్యక్రమానికి రావాలనుకోలేదు. నరేష్ వచ్చి పిలిచారు కాబట్టి వచ్చాను. అందరం కలిసే ఈ అసోసియేషన్ ఎన్నికల కోసం పని చేశాం. కాబట్టి మున్ముందు నరేష్ మాట్లాడేటప్పుడు `నేను` అని కాకుండా `మేము` అని మాట్లాడితే బాగుంటుంది `` అని రాజశేఖర్ తెలిపారు.
ఇదిలా ఉంటే ఈ కార్యక్రమంలో హేమ మాట్లాడుతుంటే అధ్యక్షుడు నరేష్ మైక్ లాగేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఆమె షాకయ్యారు. వెంటనే కలగజేసుకున్న జీవిత ఆమెకు మైక్ అందించారు. నరేష్ వ్యవహరించిన తీరుపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. `మా` లో ఆయనొక్కడే నిర్ణయాలు తీసుకుంటున్నారనీ, జనరల్ బాడీతో చర్చిండంలేదని నరేష్ పై ఆమె విమర్శలు చేసింది. ప్రారంభంలోనే ఇలా ఉంటే ఇక ముందు ముందు `మా` ఎలా ఉండబోతుందో ఏమో అని అందరూ అనుకుంటున్నారు.