పేరుకు తగ్గట్టే ట్రైలర్ గ్రేట్ గానే ఉంది!
on Oct 6, 2017
తండ్రి ప్రేమలో మల్లెపూవ్వంత సుకుమారంగా పెరిగిన హీరోయిన్... ఉన్నట్టుండి కష్టాల్లో పడింది. ఒంటరి అయిపోయింది. కామాంథుల కబందహస్తాల్లో చిక్కుకోకుండా పారిపోయింది. కానీ.. ఆ పరుగుకి ఎంతవరకూ? ఎప్పుడో ఒకప్పుడు ఆపేయాలి... తప్పదు. ఎక్కడో ఒకచోట దొరక్క తప్పదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి ఆ అమ్మాయ్ బయట పడాలంటే... ఓ హీరో కావాలి. సో.. హీరో వస్తాడు. అమ్మాయిని కాపాడతాడు... చేపడతాడు. ఈ కథతో చాలా సినిమాలొచ్చాయ్. అయితే.. ఇలాంటి కథలో హీరో గుడ్డివాడైతే.. నిజంగా అదో పెద్ద ట్విస్ట్. మరి అంధుడు.. అపద నుంచి ఎలా కాపాడతాడు? అనేది నిజంగా పెద్ద ప్రశ్నే.
శుక్రవారం విడుదలైన రవితేజ ‘రాజా ది గ్రేట్’ సినిమా ట్రైలర్.. ఇలాంటి ఎన్నో సందేహాలను ప్రేక్షకులకు మిగిల్చింది. ట్రైలర్ ని బట్టి చూస్తే... రవితేజా అంధుడు. హీరోయిన్ ఏమో కష్టాల్లో ఉంది. పాత్ర పరంగా గుడ్డివాడైనా ... రవితేజా రెబల్ గానే కనిపిస్తున్నాడు. తనదైన కామెడీతో అలరిస్తున్నాడు. అలాగే... అంధునిగా అద్భుతంగా నటిస్తున్నాడు. నటన అంటేనే.. కళ్లతో కూడుకుంది. కానీ.. ఆ కళ్లను అలా బ్లాంక్ గా పెట్టేసి అచ్చు అంధుడిలాగే నటిస్తు.. వండర్ అనిపిస్తున్నాడు. ‘లైఫ్ ఏదీ ఎదురొచ్చి మనకివ్వదు. మనమే ఎదురెళ్లి తీసుకోవాలి.
బాధ నుంచి సంతోషమైనా.. ఓటమి నుంచి గెలుపైనా..’ ఈ డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. దీన్ని బట్టి రవితేజా కేరక్టరైజేషన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మెహ్రిన్ కౌర్, రాధిక, ప్రకాశ్ రాజ్, మిర్చి సంపత్.. ఇలా ప్రముఖ నటీనటులందరూ ట్రైలర్ లో కనిపిస్తున్నారు. ట్రైలర్ పరంగా చూస్తే సినిమా రిచ్ గానే కనిపిస్తుంది. ఆసక్తిని రగిలిస్తోంది కూడా. పటాస్, సుప్రీమ్ విజయాలతో దూకుడు మీదనున్న దర్శకుడు అనిల్ రావిపూడి.. కచ్చితంగా హ్యాట్రిక్ కొడతాడు అనిపించేలా ట్రైలర్ ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత.