ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రభాస్ సోలో హీరోగా సినిమా?
on Feb 5, 2020
దర్శక ధీరుడు రాజమౌళి ఊహలకు ఊపిరి పోసిన హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. మిర్చి వంటి విజయం తర్వాత అయిదేళ్ల విలువైన సమయాన్ని ప్రభాస్ కేటాయించకపోతే... రాజమౌళికి 'బాహుబలి' తీయడం సాధ్యమయ్యేదా? దర్శకుడిగా రాజమౌళికి, కథానాయకుడిగా ప్రభాస్ కి 'బాహుబలి' జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ కి ఉన్న క్రేజే వేరు. వచ్చే ఏడాది ఈ కాంబినేషన్ లో సినిమా రానుందని ఇండస్ట్రీ టాక్.
ప్రస్తుతం ప్రభాస్ ఓ పిరియాడిక్ లవ్ స్టోరీ చేస్తున్నారు. 'జిల్' ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ స్టేజిలో ఉంది. మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి 'ఆర్.ఆర్.ఆర్' చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ప్రభాస్ హీరోగా ఓ సినిమా చేయడానికి దర్శక ధీరుడు సన్నాహాలు చేస్తున్నారట. అంతకంటే ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే... ప్రభాస్ సోలో హీరోగా ఆ సినిమా ఉంటుందట. ఓ రకంగా 'బాహుబలి' మల్టీ స్టారర్ సినిమానే. ప్రభాస్ పాత్రతో పాటు రమ్యకృష్ణ, రానా దగ్గుబాటి, అనుష్క పాత్రలు కూడా పవర్ ఫుల్ గా ఉంటాయి. అందులో ప్రభాస్ హీరోయిజాన్ని ఒక రేంజ్ లో రాజమౌళి ఎలివేట్ చేశారు. అదే సోలో హీరోగా అయితే ఇక ఏ రేంజ్ లో ఉంటుందో అభిమానులు ఊహించుకోండి.
మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే... ప్రభాస్, రాజమౌళి నిర్మాతలుగా మారుతున్నారట. వాళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాను వాళ్లే నిర్మిస్తారట.