అభిమానులు కాదు... హీరోలు మారాలి!
on Aug 26, 2016
పవన్ కల్యాణ్ అభిమానిని ఎన్టీఆర్ అభిమాని పొడిచి చంపడం కలకలం రేపింది. అభిమానం హద్దుల్లో ఉండాలన్నది పాత మాటే.. ఈసారి ఇంకాస్త గట్టిగా వినిపిస్తోంది. స్వయంగా పవన్ కల్యాణ్ రంగంలోకి దిగి.. చచ్చిపోయేంత, చంపుకొనేంత అభిమానం వద్దంటూ ఫ్యాన్స్‌కి వార్నింగ్ ఇచ్చాడు. పవన్ మాట అక్షర సత్యం! ప్రాణం కంటే.. ఏ హీరో ఎక్కువ కాడు. కుటుంబం కంటే సినిమా ఎక్కువ కాదు. అమ్మకి అన్నం పెట్టని కొడుకు కూడా.. తన హీరో సినిమా విడుదల అవుతోందంటే థియేటర్ ముందు ఫ్లెక్సీలు కట్టేస్తుంటాడు. ఇదెక్కడి అభిమానం??
అభిమానులు మారాలి సరే... మరి హీరోలు ఎప్పుడు మారతారు? మేమంతా సఖ్యతగా ఉన్నాం అని పవన్ కల్యాణ్ చెబుతున్నాడు. సరే.. ఈసారికి పవన్ మాటలు నమ్మేద్దాం. కానీ... వాటిని వీళ్లెప్పుడైనా బయట పెట్టుకొన్నారా? ఇప్పుడంటే మల్టీస్టారర్ సంస్క్రృతి ఊపందుకొంది. ఇంతకు ముందు అసలు ఈ వాతావరణం ఉండేదా? చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఈ నలుగురు హీరోలూ మరో హీరోతో ఎప్పుడైనా కలసి నటించారా? రామ్‌చరణ్, బన్నీ, ఎన్టీఆర్, ప్రభాస్.. లాంటి ఈ తరం కథానాయకులూ ఆ సాహసం చేశారా? వెంకటేష్ ముందడుగు వేయడంతో పవన్, మహేష్‌లు ఆయనతో కలసి నటించాడనికి ఒప్పుకొన్నారు.
ఆ రెండు సినిమాల్నీ పక్కన పెడితే.. టాలీవుడ్లో అసలు సిసలు మల్టీస్టారర్ సినిమాలొచ్చాయా?? మేమంతా ఒక్కటే అని చెప్పుకోవడానికైనా వీళ్లంతా ఒకే వేదికపై కనిపించారా? ఫలానా హీరో సినిమా వంద కోట్లు సాధించింది అంటే... వెంటనే ఆ రికార్డు బద్దలు కొట్టేయాలన్న ఆత్రం మరో హీరోది. అలాంటప్పుడు ఫ్యాన్స్ కొట్టుకోక.. కలసి ఎలా ఉండగలరు?? స్థాయిలోనూ, ఇమేజ్‌లోనూ తనకు సమానమైన హీరోని మరో హీరో ఎప్పుడైనా పొగడడం చూశామా? ఒకవేళ అది జరిగినా.. ఆ పొగడ్తలో కావల్సినంత కృత్రిమత్వం కనిపిస్తుంటుంది.
తమని ఇంతటి వాళ్లని చేసింది అభిమానులే అనే నిజం.. హీరోలు గుర్తించుకోవాలి. ఇలాంటి దారుణమైన సంఘటన మరోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలో, ఏం చేస్తే అభిమానులకు తప్పుడు సంకేతాలు అందకుండా ఉంటాయో.. ఆలోచించుకోవాలి. రికార్డులు, ఇమేజ్‌లు పక్కన పెట్టి.. కేవలం అభిమానుల కోణంలోంచి ఆలోచించాలి. అప్పుడే.. నిజమైన హీరోలు అనిపించుకొంటారు.