కొన్ని సినిమాలు పక్కన పెట్టేశా! – నిఖిల్
on Oct 19, 2018
‘స్వామి రారా’, ‘కార్తికేయ’ సినిమాలతో యువ కథానాయకుడు నిఖిల్ హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు. ‘హ్యాపీ డేస్’, ‘యువత’ సినిమాలు తప్ప అతడి కెరీర్లో హిట్స్ అనేవి లేవని, వరుస ఫ్లాపులతో ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి అతడికి వచ్చేస్తుందని కామెంట్స్ చేసిన వాళ్ళ చేత నిఖిల్ న్యూ ఏజ్ సినిమాలు చేస్తున్నాడనే పేరు తెచ్చుకున్నారు. ‘కార్తికేయ’ తరవాత ‘శంకరాభరణం’, ‘కిరాక్ పార్టీ’ చిత్రాలు ఆశించిన విజయాలు సాధించకున్నా... నిఖిల్ ఇమేజ్ ఏమాత్రం మారలేదు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘కేశవ’ చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకున్న పేరుని నిలుపుకున్నాడు. ప్రస్తుతం తమిళంలో అనూహ్య విజయం సాధించిన ‘కనితన్’ రీమేక్ ‘ముద్ర’లో నటిస్తున్నాడు. శుక్రవారం కొత్త సినిమా ‘శ్వాస’కి కొబ్బరికాయ కొట్టారు. ఈ సినిమా కోసం చాలా సినిమాలను పక్కన పెట్టేశానని నిఖిల్ తెలిపాడు.
తనకు ‘శ్వాస’ కథ విపరీతంగా నచ్చిందనీ, అందువల్ల ఈ సినిమా కంటే ముందు చేయాల్సిన చిత్రాలు కొన్నిటిని పక్కన పెట్టానని నిఖిల్ ప్రారంభోత్సవంలో పేర్కొన్నాడు. ఇంకా ఈ యువ కథానాయకుడు మాట్లాడుతూ ‘‘యంగ్ డైరెక్టర్స్‌తో పని చేసిన ప్రతిసారీ నాకు హిట్స్ వచ్చాయి. నా కెరీర్ చూసుకుంటే కొత్త డైరెక్టర్స్‌తో చేసిన సినిమాల్లో ఎక్కువ పర్సెంట్ హిట్స్ వున్నాయి. ఈ సినిమా కూడా హిట్ అవుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు. ఈ ‘శ్వాస’లో నిఖిల్ సరసన నివేదా థామస్ హీరోయిన్. కిషేన్ కట్టా డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు.