కథానాయకుడి నష్టాలకు... మహానాయకుడి మందు!
on Feb 15, 2019
అనుకున్నది ఒకటి... అయినది మరొకటి. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం పరాజయం పాలవుతుందని ఎవరూ ఊహించలేదు. విడుదలకు ముందు నెలకొన్న క్రేజ్ చూసి డిస్ట్రిబ్యూటర్లు భారీ రేట్లకు ఏరియాల వారీగా సినిమా థియేట్రికల్ రైట్స్ తీసుకున్నారు. తొలిరోజు సినిమాకు వచ్చిన టాక్ చూసి భారీ వసూళ్లు వస్తాయనుకున్నారు. అయితే... అనూహ్యంగా సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు వచ్చాయి. ఎన్టీఆర్ కథానాయకుడు నష్టాలను భర్తీ చేయడానికి బాలకృష్ణ ముందుకు వచ్చారు. డిస్ట్రిబ్యూటర్లు కథానాయకుడు రైట్స్ కోసం కట్టిన డబ్బుల్లో 30 శాతాన్ని వెనక్కి ఇస్తానన్నారు. అంతేకాదు... మహా నాయకుడు చిత్రాన్ని ఉచితంగా ఇస్తున్నారు. అయితే... ఇక్కడో మెలిక ఉంది. మహానాయకుడుకు వచ్చిన వసూళ్లలో 40 శాతం మాత్రమే డిస్ట్రిబ్యూటర్లకు వెళ్తుంది. మిగతాది బాలకృష్ణకు ఇవ్వాలి. కథానాయకుడు చిత్రానికి డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిలో 20 నుంచి 25 శాతం మాత్రమే వెనక్కి వచ్చిందట. బాలకృష్ణ 30 శాతం ఇస్తున్నారు. అంటే... పెట్టుబడి లో 50% వచ్చేసినట్టే. మిగతా 50 శాతం వస్తుందా? లేదా? అనేది మహానాయకుడు సాధించే విజయంపై ఆధారపడి ఉంటుంది. కథానాయకుడిలా భారీ పరాజయం కాకుండా ఓ మోస్తరు విజయం సాధించినా... డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు వచ్చేస్తాయి. మరి, మహానాయకుడి మందు పనిచేస్తుందో లేదో ఈ నెల 22న తెలుస్తుంది. ఆ రోజే ఎన్టీఆర్ మహానాయకుడు విడుదలవుతుంది కదా!