ఉదయ్‌కిరణ్ బయోపిక్‌లో 'మెగా' ప్రస్తావన ఉంటుందా?
on Nov 26, 2019
దివంగత నటుడు ఉదయ్ కిరణ్ జీవితం ఆధారంగా యువ కథానాయకుడు సందీప్ కిషన్ ఒక బయోపిక్ చేయాలనుకుంటున్నాడని ఫిలింనగర్ టాక్. షార్ట్ ఫిలిమ్స్ తీసిన ఓ యువకుడు డైరెక్ట్ చేయనున్నాడట. ఉదయ్ కిరణ్ జీవితంలో ఎన్నో మలుపులు, ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా అతడు హీరోగా ఎదిగిన తీరు, హీరోగా ప్రయాణం, డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకోవడం... సినిమాకు కావలసిన మెటీరియల్ అతడి జీవితంలో ఉంది.
ఉదయ్ కిరణ్ జీవితం అంతా ఒక ఎత్తు, మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మితతో నిశ్చితార్థం మరో ఎత్తు. హీరోగా ఉదయ్ కిరణ్ వరుస విజయాల్లో ఉన్నప్పుడు సుష్మితతో అతడి నిశ్చితార్థం జరిగింది. ఏమైందో ఏమో... కారణాలు ఏమిటనేది సామాన్య ప్రజానీకానికి తెలియదు. నిశ్చితార్థం రద్దయ్యింది. తర్వాత హీరోగా ఉదయ్ కిరణ్ డౌన్ ఫాల్ మొదలైంది. మరో అమ్మాయితో వివాహం జరిగింది. హీరోగా అవకాశాలు తగ్గడంతో డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు.
ఉదయ్ కిరణ్ జీవితంలో 'మెగా' ఎపిసోడ్ మీద ఎక్కువమందికి ఆసక్తి ఎక్కువ. ఎందుకు నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యింది? ఏం జరిగింది? అని తెలుసుకోవాలని చాలామంది కోరిక. ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ ని మెగా ఫ్యామిలీ తొక్కేసిందని విమర్శించే వ్యక్తులు కొందరు ఉన్నారు. మరి, ఉదయ్‌కిరణ్ బయోపిక్‌లో 'మెగా' ప్రస్తావన ఉంటుందా? ఉంటే సందీప్ కిషన్ ఎలా చూపిస్తాడు? అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఇది కత్తిమీద సాము లాంటి వ్యవహారమే.