ఎన్టీఆర్ ఎవరో తెలియదంటే బూతులు తిడతారా?
on Jun 3, 2020
పవన్ కళ్యాణ్ 'బంగారం' సినిమాలో నటించిన మీరా చోప్రా గుర్తునారా? తర్వాత ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన 'వాన'లో కథానాయికగా, నాగార్జున 'గ్రీకు వీరుడు'లో చిన్న పాత్రలో నటించారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై ఆమె కారాలు మిరియాలు నూరుతున్నారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు... హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ట్విట్టర్ వేదికగా కంప్లయింట్ చేశారు. ఎందుకు? ఏమిటి? అనేది తెలుసుకోవడానికి రెండు రోజులు ముందుకు వెళ్లాలి.
జూన్ 1వ తేదీన ట్విట్టర్లో మీరా చోప్రా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పారు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబులో ఎవరంటే ఇష్టమని అడిగితే మహేష్ పేరు చెప్పారు. 'దమ్ము, శక్తి సినిమాలు చూడు. ఎన్టీఆర్ గురించి తెలుస్తుంది' అని మహేష్ అభిమాని ఒకరు వెటకారం చేశారు. 'నాకు ఆసక్తి లేదు' అని మీరా చోప్రా చెప్పారు. ఎన్టీఆర్ ఎవరో తెలియదన్నందుకు అభిమానులు ఆమెను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఒకరు బిచ్ అని తిట్టారు. ఆమె తల్లితండ్రులు కరోనా వచ్చి మరణించాలని శపించారు. దాంతో మీరా చోప్రాకి కోపం వచ్చింది.
"తారక్... మీకంటే మహేష్ బాబును ఎక్కువ ఇష్టపడతానని చెప్పినందుకు నాపై బిచ్, పోర్న్ స్టార్ ముద్ర వేస్తారని తెలియదు. నా తల్లితండ్రులను ఇలా శపిస్తారా? ఇటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నందుకు మీరు సక్సెస్ ఫుల్ అని ఫీలవుతున్నారా? నా ట్వీట్ ను ఇగ్నోర్ చేయరని ఆశిస్తున్నాను" అని మీరా చోప్రా ట్వీట్ చేశారు. వేలసంఖ్యలో ఇటువంటి ట్వీట్స్ వస్తున్నాయని ఆమె తెలిపారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ట్విట్టర్ ద్వారా కంప్లయింట్ చేశారు. తనకు తెలుగు అర్థమవుతుందని, తెలుగులో ట్రోల్ చేసిన ట్వీట్స్ స్క్రీన్ షాట్స్ తీసి మరీ మీరా చోప్రా ట్వీట్స్ చేశారు.