ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా గ్లామర్ తగ్గలేదు!
on Aug 20, 2017
కోలీవుడ్లో సిమ్రాన్ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో సూపర్ స్టార్ డమ్ ఎంజాయ్ చేసిన కథానాయిక ఎవరు? అనడిగితే... ఎవరైనా ఠక్కున చెప్పేస్తారు ‘జ్యోతిక’ అని. ఆ స్థాయిలో తమిళనాట జ్యోతిక హవా సాగింది. నటుడు సూర్యను పెళ్లాడేసింది. సినిమాకు కూడా స్వస్తి చెప్పేసింది. అయితే... ఒక్కసారి ముఖానికి రంగేసుకున్న తర్వాత అంత తేలిగ్గా ఆ దురద వదలదు. పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ని కనేసి, వారి ఆలనా పాలనా చూసుకొని, వారు కాస్త ఎదిగారు అనిపించగానే... మళ్లీ జ్యోతిక దృష్టి సినిమాలపై పడింది.
భార్య మాట కాదనలేని సూర్య... ‘ఎస్’అనేశాడు. ‘36 వయిదినిలే’ సినిమా వచ్చేసింది. ఆ సినిమా యావరేజ్ గా ఆడినా.. జ్యోతిక నటనకు మాత్రం మంచి మార్కులే వేశారు జనం.
మరి ఒక సినిమాతో తీరుతుందా ఆనందం? అందుకే... స్వయంగా సూర్యనే సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్ పతాకంపై తన భార్య జ్యోతిక ప్రధానపాత్రధారిగా ‘మగళీర్ ముట్టుం’ సినిమాను మొదలుపెట్టాడు. బ్రహ్మ దర్శకుడు. మహిళా ప్రధాన్యత నేపథ్యంలో సాగే సినిమా ఇది. వినోదం, సందేశం రెండూ సమపాళ్లలో ఉంటాయని దర్శకుడు చెబుతున్నారు. జ్యోతిక పాత్ర స్ఫూర్తిమంతంగా ఉంటుందని టాక్.
ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన రెండు పోస్టర్లను విడుదల చేశారు. అందులో జ్యోతికని చూసిన వాళ్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా ఆమెలో గ్లామర్ ఇసుమంత కూడా తగ్గలేదని అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. ఈ సినిమా కోసం జ్యోతిక సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంది. నాజర్, భానుప్రియ, లివింగ్ స్టన్, పొన్నువన్నన్, ఊర్వశి, శరణ్య ఇందులో ప్రధాన పాత్రధారులు. నిజానికి ఈ సినిమాను జులైలోనే విడుదల చేయాలని భావించారు. అయితే... అనుకోని అవాంతరాలు ఎదురవ్వడంతో సెప్టెంబర్ 15న ఈ సినిమా విడుదల కానుంది.