'బాహుబలి 2' కంటే 'మగధీర'కు ఎక్కువ కలెక్షన్స్!
on Sep 11, 2018
'బాహుబలి 2'ను 'మగధీర' బీట్ చేసింది. వసూళ్ల విషయంలో ప్రభాస్ సినిమాను రామ్చరణ్ సినిమా అధిగమించి ఓ మెట్టు పైకి ఎక్కింది. ఊరుకోండి... ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా 'బాహుబలి 2'. పదేళ్ల క్రితం వచ్చిన 'మగధీర' దాన్ని దాటేయడం ఏంటి? చెవిలో పూలు పెడుతున్నారా? 'బాహుబలి 2' తరవాత వచ్చిన ఒక్క సినిమా వసూళ్ల విషయంలో దాన్ని బీట్ చేయలేకపోయింది. మరి, 'మగధీర' చేయడం ఏంటని అనుకుంటున్నారా? వసూళ్ల విషయంలో 'బాహుబలి 2'ను 'మగధీర' బీట్ చేసింది. అయితే... అది ఇండియాలో కాదు, జపాన్లో!
మన దేశంలో భారీ విజయం సాధించిన 'బాహుబలి 2' విదేశీ ప్రేక్షకుల్ని సైతం ఆకట్టుకుంది. ముఖ్యంగా జపాన్లో ప్ర్రేక్షకులు 'బాహుబలి 2'కి బ్రహ్మరథం పట్టారు. చిత్రదర్శకుడు రాజమౌళికి అక్కడి ప్రేక్షకులు అభిమానులు అయ్యారు. దీన్ని గమనించిన జపాన్ నిర్మాతలు చారిత్రక నేపథ్యంలో రాజమౌళి దర్శకత్వం వహించిన 'మగధీర'ను డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఇప్పటివరకూ ఈ సినిమా జపాన్లో 2.45 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. రూపాయల్లో అయితే 17.5 కోట్లకు పైమాటే. ఇంకా థియేటర్లలో సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. రాజమౌళి బ్రాండ్ 'మగధీర'పై కాసుల వర్షం కురవడానికి కారణమైంది. అసలు ఈ సినిమా అక్కడ విడుదల కావడానికి కారణమైన 'బాహుబలి 2' ఎంత వసూలు చేసిందో తెలుసా? 1.82 మిలియన్ డాలర్స్ మాత్రమే. రామ్ చరణ్ 'మగధీర' కంటే రజనీకాంత్ 'ముత్తు' ముందుంది. జపాన్లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో మొదటిస్థానం 'ముత్తు'దే. 3.08 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. 'మగధీర' సినిమా 'ముత్తు'ను అధిగమిస్తుందో? లేదో? వెయిట్ అండ్ సీ!!
Also Read