ఆర్టికల్ 370పై తేజ హిందీ సినిమా
on Nov 27, 2019
దర్శకుడు తేజకు ముంబై, హిందీ సినిమాలు కొత్త కాదు. ఆయన సినిమాటోగ్రాఫర్ గా పరిచయమైంది రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన హిందీ సినిమా 'రాత్'తో. అదే సినిమా తెలుగులో 'రాత్రి'గా విడుదలైంది. తర్వాత పలు హిందీ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. అయితే 'చిత్రం'తో దర్శకుడిగా మారిన తర్వాత హిందీ సినిమాలు చేయలేదు. ఒక్క హిందీ సినిమా 'పితా'కు కథ, స్క్రీన్ ప్లే సమకూర్చడంతో పాటు స్వయంగా నిర్మించారు. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ముంబైకి తేజ మకాం మారుస్తున్నారు. ఆయన ఓ హిందీ సినిమాకు దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యారు.
దేశవ్యాప్తంగా చర్చకు కారణమైన, చాలామంది హర్షాతిరేకాలు వ్యక్తం చేసిన జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుపై తేజ హిందీ సినిమా చేయనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ముంబైలోని ఒక నిర్మాణ సంస్థకి, తేజకి మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని తేజ కూడా ధ్రువీకరించారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ నటించే అవకాశాలు ఉన్నాయని టాక్. అదే సంగతి తేజను అడిగితే "ముందు నేను స్క్రిప్ట్ కంప్లీట్ చేయాలి. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం" అని నవ్వేశారు.