ఎన్టీఆర్ పరువు తీస్తున్న దిల్రాజు
on Jan 17, 2017
ఎన్టీఆర్ కెరీర్లో చాలా ఫ్లాపులున్నాయి. అందులో రామయ్యా వస్తావయ్యా ఒకటి. గబ్బర్ సింగ్ తరవాత హరీష్ శంకర్ నుంచి వచ్చిన సినిమా ఇది. పైగా ఎన్టీఆర్ - దిల్రాజు కాంబినేషన్. దాంతో అంచనాలు పెరిగాయి. వాటిని అందుకోవడంలో ఈ సినిమా విఫలమైంది. ఈ సినిమా వచ్చి వెళ్లిపోయి చాలా కాలమైంది. అయితే ఈ ఫ్లాపుని మాత్రం మర్చిపోలేకపోతున్నాడు దిల్రాజు. ఏ ఇంటర్వ్యూలో కూర్చున్నా.. కచ్చితంగా రామయ్యా వస్తావయ్యా ప్రస్తావన తీసుకొస్తున్నాడు. `ఆ సినిమా వల్ల బయ్యర్లు రోడ్డు మీద పడ్డారు.. మా సంస్థకు చాలా లాస్` అంటూ రామయ్యా వస్తావయ్యా ఫ్లాపుని ఎన్టీఆర్ అభిమానులకు పదే పదే గుర్తుకు తెస్తున్నాడు. అసలు సందర్భమేం లేకుండా రామయ్యా వస్తావయ్యా ప్రస్తావన ఎందుకు తెస్తున్నాడంటూ... ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్టవుతున్నారు.
సాధారణంగా ఏ దర్శకుడైనా, నిర్మాత అయినా.. తన పరాజయాల్ని పబ్లిగ్గా ఒప్పుకోరు. `అయిపోయిన సినిమాల గురించి ఎందుకు లెండి` అంటూ సమాధానం దాటేస్తారు. కానీ దిల్రాజు మాత్రం కోరి మరీ కెలుక్కోవడం ఎన్టీఆర్ అభిమానుల్ని విస్మయానికి గురి చేస్తోంది. పాపం.. ఆ సినిమా వల్ల దిల్రాజు ఎంత నష్టపోయాడో ఏంటో..? అందుకే ఇన్నిసార్లు కలవరిస్తున్నాడు.