చిరంజీవికి తమ్ముడు గుర్తొచ్చిన వేళ...
on Nov 27, 2019
ఇంటర్నెట్లో ఒక్కసారిగా 'అర్జున్ సురవరం' సినిమా పేరు మారుమోగుతోంది. దీనికి కారణం... మెగాస్టార్ చిరంజీవి. సారీ సారీ... పవన్ కల్యాణ్ రీజన్ అని చెప్పాలేమో! 'అర్జున్ సురవరం' ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి చిరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి ఒక కళ తీసుకొచ్చారు. నిఖిల్ తనకు తమ్ముడు వంటి వాడని ఆయన చెప్పారు. తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేసి ప్రేక్షకుల్ని, వేదిక మీదున్న సినిమా ప్రముఖుల్ని నవ్వించారు. ఇదంతా ఒక ఎత్తు... తమ్ముడు పవన్ కల్యాణ్ మేనరిజమ్స్ ను చిరంజీవి ఇమిటేట్ చేయడం మరో ఎత్తు. ఇంటర్నెట్లో 'అర్జున్ సురవరం' సినిమా పేరు మారుమోగడానికి కారణం పవన్ ని చిరంజీవి ఇమిటేట్ చేయడమే.
'అర్జున్ సురవరం'లో చేగువేరా మీద ఒక పాట ఉంది. ఆ పాట గురించి చిరంజీవి మాట్లాడుతూ "నాకు ఈ సినిమాలో చేగువేరా పాట చూసినప్పుడు ఎవరు గుర్తొచ్చారో తెలుసా?" అంటూ పవన్ కల్యాణ్ షర్ట్ కాలర్ లోపల నుండి మెడ మీద చెయ్యి వేసే మేనరిజమ్ ను చిరంజీవి ఇమిటేట్ చేశారు. 'అర్జున్ సురవరం' ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఒకటే ఈలలు, గోల గోల. మెగాభిమానుల ఆనందానికి అయితే అవధులు లేకుండా పోయాయి. చిరంజీవి పుణ్యమా అంటూ వాయిదాల మీద వాయిదాలు పడి, చాలా రోజుల నిరీక్షణ తర్వాత విడుదల అవుతున్న 'అర్జున్ సురవరం' చిత్రానికి మంచి బజ్ వచ్చింది. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా తమిళంలో విజయం సాధించిన 'కణిదన్'కు రీమేక్.