ENGLISH | TELUGU  

భానుమతి రామకృష్ణ మూవీ రివ్యూ

on Jul 3, 2020


నటీనటులు: నవీన్ చంద్ర, సలోనీ లుత్రా, రాజా చేంబోలు, హర్ష చెముడు, అజయ్ తదితరులు 
సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు
నేపథ్య సంగీతం: అచ్చు రాజమణి
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
నిర్మాత: యశ్వంత్ ములుకుట్ల
రచన-దర్శకత్వం: శ్రీకాంత్ నాగోతి
విడుదల తేదీ: 03 జూలై 2020

ఓటీటీ వేదికలలో వెబ్ సిరీస్/సినిమాలు అంటే... అయితే శృంగారం పాళ్లు ఎక్కువ దట్టించడమో, లేదంటే బూతు మాటలతో హింసాత్మక సన్నివేశాలను నింపడమో తప్పనిసరి అని ఇటు దర్శక-నిర్మాతలు, అటు ప్రజలు ఓ అంచనాకు వచ్చారు. ఓటీటీలలో ఎరోటిక్, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎక్కువ వస్తున్న ఈ కాలంలో కుటుంబంతో చూడదగ్గ చక్కటి చిత్రం 'భానుమతి రామకృష్ణ'. వెండితెరపై విడుదల చేద్దామని తీశారు. కరోనా కారణంగా డిజిటల్ తెరపైకి వచ్చింది. జీవితంలో 30 ఏళ్లు వచ్చిన ఓ జంట ప్రేమలో ఎలా పడిందనేది చిత్రకథ. వీక్షకులను ఎంతమేరకు ఈ సినిమా ఆకట్టుకుంటుందో రివ్యూ చదివి తెలుసుకోండి.

కథ:

భానుమతి (సలోని లుత్రా) హైదరాబాద్‌లో పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్న నేటితరం అమ్మాయి. ఐదేళ్లుగా అమెరికాలో ఉన్న రామ్(రాజా చేంబోలు)తో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉంటుంది. ఇండియా వచ్చిన రామ్, మరో అమ్మాయితో ప్రేమలో ఉన్నానని బాంబ్ పేల్చి, బ్రేకప్ చెబుతాడు. అంతకంటే ముఖ్యంగా భానుమతికి 30 ఏళ్లు వచ్చాయని గుర్తు చేసి ఇగో హర్ట్ చేస్తాడు. బ్రేకప్ బాధలో ఉండగా భానుమతి టీమ్‌లోకి తెనాలి నుండి హైదరాబాద్ వచ్చిన రామకృష్ణ (నవీన్ చంద్ర)తో ప్రేమలో పడుతుంది. అతడూ ఆమెను ప్రేమిస్తాడు. ఇద్దరూ ప్రేమలో ఎలా పడ్డారు? ఇద్దరి మధ్య గొడవ ఎందుకొచ్చింది? మళ్లీ ఎలా కలిశారు? అన్నది మిగతా సినిమా.  

ప్లస్‌ పాయింట్స్‌:
నవీన్ చంద్ర నటన
హీరో పాత్రచిత్రణ, అందులో అమాయకత్వం
కథ, పాత్రల్లో సహజత్వం
నిడివి (గంటన్నర)

మైనస్‌ పాయింట్స్‌:
బలమైన భావోద్వేగాలు
వినోదం
సన్నివేశాల్లో స్పష్టత కొరవడటం
ఎడిటింగ్
ముగింపు

విశ్లేషణ:

'భానుమతి రామకృష్ణ' కథేంటో,  ప్రారంభం నుండి ముగింపు వరకు ఎలా ఉంటుందో ట్రైలర్‌లో చూపించారు. మరి, సినిమాలో ఏముంది? కథా పరంగా చెప్పుకొంటే అంతకు మించి ఏమీ లేదు. కానీ, పాత్రల పరంగా చెప్పుకోవాలంటే చాలా ఉంది. ముఖ్యంగా హీరో పాత్రను తీర్చిదిద్దిన విధానం బావుంది. స్మాల్ టౌన్ తెనాలి నుండి హైదరాబాద్ సిటీకి వచ్చిన 30 ఏళ్ల మనిషి ఎలా ఉంటాడు? అనేది బాగా చూపించారు. హీరో పాత్రలో అమాయకత్వం, మంచితనం ఆకట్టుకుంది. అలాగే, భానుమతి పాత్రతో పాటు హైదరాబాద్ నగర జీవన విధానానికి అలవాటు పడిన హీరో కజిన్‌గా హర్ష, సహ జీవనం చేస్తున్న జంట... ప్రతి పాత్ర సహజంగా ఉంటుంది. అయితే, ఎక్కడా పాత్రల తాలూకూ భావోద్వేగాలను లోతుగా చూపించలేదు. పైపైన సన్నివేశాలను తీసుకుంటూ, స్పష్టత లేకుండా అర్థాంతరంగా ముగించుకుంటూ వెళ్లిపోయారు. 

బ్రేకప్ తరవాత స్నేహితురాలు చెప్పడంతో హీరోయిన్ ఓ అబ్బాయిని కలుస్తుంది. తన గురించి అబ్బాయి పూర్తిగా చెబుతాడు. ఈలోపు హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫ్రెండ్, ఆమె భర్త వస్తారు. పక్కనున్న అబ్బాయిని చూసి 'రామ్' అనుకుంటారు. ఫైనల్లీ... పెళ్లి చేసుకుంటున్నారా? అనేసి వెళ్లిపోతారు. తరవాత అబ్బాయి రియాక్షన్ ఏంటో? హీరోయిన్ ఫీలింగ్ ఏంటో? చూపించారు. కట్ చేస్తే... మరో సీన్. సహ జీవనం చేస్తున్న జంటతో 'మీరు విడిపోతారేమోనని బాధగా ఉంది?' అని హీరో చెబుతాడు. అప్పుడు వాళ్ల రియాక్షన్ ఏంటో అర్థం కాదు. ఇలా అర్థాంతరంగా ముగించిన సన్నివేశాలు ఉన్నాయి. కొన్ని సన్నివేశాల్లో భావోద్వేగాలను అస్పష్టంగా ముగించినట్టు అనిపిస్తుంది. పతాక సన్నివేశాల్లోనూ హడావిడి కనిపిస్తుంది. హీరో ప్రేమలో ఎప్పుడు, ఎలా పడ్డాడు? అనేది వీక్షకుడి మదికి అర్థం కాదు. ప్రేమలో పడిన తరవాత చెప్పడానికి వ్యక్తం చేయడానికి ఇబ్బంది పడే సన్నివేశాలను, వ్యక్తం చేయకముందే బ్రేకప్ కావడాన్ని హుందాగా చూపించారు. పతాక సన్నివేశాలలో అయినా భావోద్వేగాలను బలంగా చూపిస్తారని అనుకుంటే నాలుగు మాటలు, ఓ ముద్దుతో ముగించారు. అన్నిటికంటే ముఖ్యంగా హీరో హీరోయిన్ క్యారెక్టర్స్, ఆ సీన్స్ 'ఆడువారి మాటలకు అర్థాలే వేరులే' సినిమాలో వెంకటేష్, త్రిష క్యారెక్టర్స్, అందులో సన్నివేశాలను గుర్తు చేస్తాయి. 

నటీనటుల పనితీరు:

రామకృష్ణ పాత్రలో నవీన్ చంద్ర ఒదిగిపోయాడు. నటుడిగా కొత్తదనం చూపించాడు. ఎక్కడా తన గత చిత్రాల్లో పాత్రలు గుర్తుకు రాకుండా, కొత్త నటుడిని చూపించాడు. పాత్ర కూడా అలా కుదిరింది. పాత్ర తాలూకు అమాయకత్వాన్ని అతడు బాగా క్యారీ చేశాడు. భానుమతిగా సలోని లూత్ర పర్వాలేదు. పాత్రకు తగ్గట్టు చక్కగా చేసింది. అయితే, తెలుగు సినిమా హీరోయిన్ మెటీరియల్ కాదు. హర్ష చెముడులో కామెడీ టైమింగ్, నటుడిని దర్శకుడు సరిగా వాడుకోలేదు. కానీ, టీవీలో పవన్ కళ్యాణ్ 'ఖుషి' వస్తున్నప్పుడు హీరోయిన్, హర్ష మధ్య సీన్ నవ్విస్తుంది. మిగతా పాత్రల్లో గుర్తుంచుకునేవి లేవు.  

తెలుగుఒన్‌ ప‌ర్‌స్పెక్టివ్‌:

షార్ట్ ఫిలింకి ఎక్కువ, ఫీచర్ సినిమాకి తక్కువ అన్నట్టుందీ 'భానుమతి రామకృష్ణ'. మంచి కథ రాసున్నప్పటికీ... తెరపైకి తీసుకురావడంలో దర్శకుడు తడబడ్డాడు. ఓటీటీలో సిరీస్/సినిమాలను కుటుంబంతో కలిసి చూడటానికి ఇబ్బంది పడుతున్న ఈ రోజుల్లో, అందరితో కలిసి చూడదగ్గ సినిమా కావడం 'భానుమతి రామకృష్ణ'కు ప్లస్ పాయింట్. దానికి తోడు కొన్ని సన్నివేశాలు, హీరో నటన బావున్నాయి. నచ్చకపోతే ఫార్వర్డ్ చేసుకొనే అవకాశం ఉంది కాబట్టి వీక్షకులు ఓసారి చూసే ప్రయత్నం చేయవచ్చు.

రేటింగ్‌: 2/5


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.