'గుంజన్ సక్సేనా'ను ఎందుకు చూడాలో చెప్పే 4 బలమైన కారణాలు
on Aug 12, 2020
"ప్లేన్ లడ్కా చలాయే యా లడ్కీ, దోనో కో పైలట్ హీ బోల్తే హై."
కాక్‌పిట్ బయట కాకుండా లోపల పనిచేసే ఉద్యోగిని కావాలని కలలు కంటున్న ఒక యువతిని ఆమె సోదరుడు ఎగతాళి చేసిన తర్వాత తండ్రి ఆమెతో అన్న మాటలివి. 'గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గాళ్' కథకు ఆయువుపట్టు ఈ మాటల్లో ఉంది. ఫ్లైట్ లెఫ్టినెంట్ గుంజన్ సక్సేనా సాధించిన విజయాలు కచ్చితంగా ఆకట్టుకున్నప్పటికీ, ఇది కేవలం ఆమె బయోపిక్ కాదు. ఇది ఓ తండ్రి, ఓ కూతురి కథ. ప్రపంచంలో ఒక వ్యక్తి స్థానాన్ని నిర్దేశించేది జెండర్ అనే పితృస్వామ్య భావజాలాన్ని బద్దలుకొట్టి, సామర్థ్యమే దానికి కొలబద్ద అని నిరూపించే తండ్రీకూతుళ్ల కథ. శరణ్ శర్మ డైరెక్ట్ చేయగా, టైటిల్ రోల్‌ను జాన్వీ కపూర్ పోషించిన ఈ మూవీని ఎందుకు చూడొచ్చంటే...
1. పురోగామి భావాలున్న తండ్రిగా పంకజ్ త్రిపాఠి సునాయాస నటన కోసం చూడొచ్చు. నిజాయితీగా చెప్పాలంటే, పంకజ్ ఒక్కడి కోసం ఈ సినిమాని చూడొచ్చు. దర్శకుడు తనపై పెట్టుకున్న నమ్మకానికి ఆయన నూటికి నూరు పాళ్లు న్యాయం చేశాడు.
2. ధైర్యం, స్త్రీవాదం, సంకల్పం అనే అంశాల మీద గ్రిప్పింగ్‌గా అల్లిన కథ కోసం ఈ మూవీని చూడాలి. ఒక కాలంలో పురుషాధిపత్యానికి పేరుపొందిన రంగంలో కట్టుబాట్లను ధిక్కరించి తన కోసం ఒక చోటును కల్పించుకున్న గుంజన్ సక్సేనా కథను చూడాలి. కార్గిల్ యుద్ధంలో పైలట్‌గా తన సామర్థ్యాన్ని ప్రదర్శించి రెక్కీ ఆపరేషన్లు, రెస్క్యూ మిషన్లు నిర్వహించి, యుద్ధంలో పాల్గొన్న తొలి మహిళా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా ఎలా రికార్డుల్లోకి ఎక్కిందో మనం చూడాలి.
3. ఆర్మీ కుటుంబాల త్యాగాలు ఎలా ఉంటాయో సంగ్రహంగా చూపించినందుకు ఈ చిత్రాన్ని చూడాలి. దేశం కోసం పోరాడటానికి తమకెంతో ప్రియమైన వారిని పంపడానికి.. ఆఖరుకి వాళ్లు యుద్ధంలో చనిపోతారేమోనని భయం అనుక్షణం వెంటాడుతున్నప్పటికీ.. ఆర్మీ ఫ్యామిలీలు ఎలాంటి త్యాగాన్ని ప్రదర్శిస్తుంటాయో కళ్లకు కట్టినట్లు చూపించినందుకు ప్రేక్షకులు ఈ సినిమాని చూడాల్సిందే.
4. తమ పాత్రలను అర్థం చేసుకొని, వాటిలా నటించడం కాకుండా వాటిలా ప్రవర్తించిన నటుల కోసం ఈ మూవీని చూడొచ్చు. సినిమా సినిమాకీ నటిగా ఎదుగుతూ వచ్చిన జాన్వీ కపూర్ టైటిల్ రోల్లో చక్కగా ఇమిడిపోగా, ఆమెను మించి మానవ్ విజ్, వినీత్‌కుమార్ సింగ్ మరింత ఉన్నత స్థాయి నటనను ప్రదర్శించారు. కమాండింగ్ ఆఫీసర్‌గా మానవ్ విజ్, విలన్‌గా వినీత్‌కుమార్ సింగ్ మనల్ని బాగా ఆకట్టుకుంటారు.
'గుంజన్ సక్సేనా' పాత్‌బ్రేకింగ్ ఫిల్మ్ కాదు. అయినప్పటికీ ఆహ్లాదకరమైన బ్యాగ్రౌండ్ స్కోర్, చక్కని అభినయాలతో స్టోరీ ఎలివేట్ అయ్యి, ఒక మంచి సినిమా చూశామన్న అనుభూతినిస్తుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమ్ అవుతోంది.